Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోడేపూడి సుజల స్రవంతిపై..మిషన్ భగీరథ పేరు
- వైరా ప్రాజెక్టు ఫిల్టర్ బెడ్స్‌పై పేరు తొలగింపును అడ్డుకున్న కార్మికులు
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి మధిర నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మహామనిషి పేరును తుడిచేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.. అసెంబ్లీలో సీపీఐ(ఎం) పక్ష నేతగా ప్రజల కోసం జీవితాంతం నిస్వార్థంగా సేవ చేసిన బోడేపూడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రశంసలూ పొందారు.
అలాంటి వ్యక్తి సేవలను, ఆ పేరుతో ఉన్న అభివృద్ధి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం కనుమరుగు చేసేందుకు యత్నిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధిర నియోజకవర్గంలోని అప్పటి 5 మండలాలు వైరా, బోనకల్, మధిర, ఎర్రు పాలెం, తల్లాడ మండలాలకు ఫ్లోరైడ్ రహిత రక్షిత నీటి పథకం కోసం ప్రతిపాదనలు పంపి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంతో మాట్లాడి దాని సాధనకు బోడేపూడి కృషి చేశారు. అనంతరం ఆయన మరణించారు. బోడేపూడి ప్రతిపాదించిన రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేసిన ప్రభుత్వం దానికి ''బోడేపూడి సుజల స్రవంతి'' పథకంగా నామకరణం చేసింది. వైరా ప్రాజెక్ట్ నీటి ఆధారంగా పథకాన్ని నిర్మించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 25.10.2002న ప్రారంభించారు. శివారు గ్రామాలతో కలిపి సుమారు 170 గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి.. బోడేపూడి వెంకటేశ్వరరావు సుజల స్రవంతి పథకం అని బోర్డులు రాయించింది.
టీఆర్ఎస్ పాలనలో బోడేపూడి సుజల స్రవంతి పథకం పేరును తొలగించి మిషన్ భగీరథ పథకం పేరు రాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని గ్రామాల్లో అభ్యంతరాలు తెలిపినా లెక్కచేయని అధికారులు మొత్తం నియోజకవర్గంలో పాత ట్యాంకులపై మిషన్ భగీరథ పేరును రాయించారు. వైరా ప్రాజెక్ట్ గుట్టలపై ఉన్న బోడేపూడి సుజల స్రవంతి పథకం ఫిల్టర్ బెడ్స్‌పై పేరును కూడా తొలగించటానికి అధికారులు చేసిన ప్రయత్నాన్ని అందులో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోవటంతో నిలిపేశారు. దాంతో అక్కడ మొత్తం పథకానికి మిషన్ భగీరథ పథకం యూనిఫాం కలర్ వేసి.. బోడేపూడి వేంకటేశ్వరరావు సుజల స్రవంతిని తొలగించలేక, మిషన్ భగీరథను రాయలేక అలానే ఉంచారు.
బోడేపూడి వెంకటేశ్వరరావు పేరును తొలగించటం సబబు కాదని సీపీఐ(ఎం) నేతలు అప్పటి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా వినతి ఇచ్చారు. అంతేగాక సుజల స్రవంతికి వెళ్లే రోడ్డుకు బోడేపూడి మార్గ్‌గా పెట్టేందుకు వైరా క్రాస్ రోడ్డులో పెద్ద ఆర్చి నిర్మించి.. ఖాళీగా వదిలేశారు. వైరాలో విద్యా, సహకార రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడి పేరును, ఆయన సాధించిన పథకంపై ఉన్న పేరును తొలగించటానికి తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టి పని చేయటాన్ని అభ్యుదయ వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైరా ప్రాజెక్ట్ గుట్టలపై ఉన్న రక్షిత మంచినీటి పథకంపై బోడేపూడి వెంకటేశ్వరరావు సుజల స్రవంతిగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.