Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.వంద కోట్ల బిల్లులు
- రెండు నెలలుగా బ్యాంక్‌ల వద్ద రైతుల పడిగాపులు
- యాసంగి పెట్టుబడి కోసం తిప్పలు
- వానాకాలం అప్పులు చెల్లించలేక అవస్థలు
- రైతుల ఇంటి చుట్టూ వడ్డీ వ్యాపారులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రైతుకు పంట సాగు.. పంట విక్రయించడం వరకు తిప్పలు పడి అమ్ముకున్నారు.. ఆ డబ్బులూ సకాలంలో రావడం లేదు. ధాన్యం విక్రయించి రెండు నెలులు గడుస్తున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 11వేల మంది రైతులకు సుమారు వంద కోట్ల ధాన్యం డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో యాసంగి సాగుకు పెట్టుబడి లేక తిప్పలు పడుతున్నారు. ఇదిలా ఉంటే, వానాకాలం చేసిన అప్పు తీర్చాలని వడ్డీ వ్యాపారులు రైతుల ఇంటి చుట్టూ తిగుతున్నారు. ధాన్యం అమ్మి రెండు నెలులు అయినా ఇంకా డబ్బులు ఇస్తలేవేందంటూ నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక రైతులు అవమానాలకు గురవుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్లో 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందుకుగాను లక్ష 82 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్న అంచనా వేశారు. మార్కెట్‌కు లక్ష 54 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 33 వేల 255 మంది రైతుల నుంచి లక్ష 54 వేల 724 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వం రైతులకు రూ.303 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.210 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా సుమారు వంద కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.
కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యం
ధాన్యం కొనుగోలు చేసిన మరుసటి రోజునే ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉన్నప్పటికీ.. వారాల తరబడి చేయకపోవడం, బ్యాంక్ ఖాతాలకు ఆధార్‌కార్డు, మొబైల్ నెంబర్ లింక్ లేదని.. నానా సాకులతో కొనుగోలు కేంద్రాల నిరాహకులు జాప్యం చేశారు. జిల్లా కేంద్రానికి చేరిన ఓపీఎమ్ఎస్ డాటాను రాష్ట్ర కేంద్రానికి పంపి ఎప్పటికప్పుడూ ధాన్యం డబ్బులు తెప్పించుకోవాల్సిన జిల్లా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారాల కొద్దిగా ఫైల్స్‌ను ముందుకు పంపకుండా నిర్లక్ష ధోరణి ప్రదర్శించింది. దాంతో రైతులకు ఇంకా డబ్బులు అందడం లేదు.
అవమానాలకు గురవుతున్న రైతులు
ధాన్యం డబ్బులు సకాలంలో అందక అప్పు తీర్చకపోవడంతో రైతులను వడ్డీ వ్యాపారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వడ్దీ వ్యాపారులే కాదు.. ఎరువుల షాపు వ్యాపారులు, ట్రాక్టర్, వరి కోత మిషన్ యజమానులు, కూలీలు ఇలా అందరూ తమ డబ్బులు చెల్లించాలని రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రైతులు అవమానాలు తట్టుకోలేక, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. డబ్బులు కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
'మూడెకరాల్లో వరి సాగు చేసి, 280 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్మాను. ధాన్యం అమ్మి నెల రోజులు దాటింది. రూ. 2 లక్షల19 వేలు రావాలి. ధాన్యం కొనుగోలు చేసిన వారిని అడిగితే బ్యాంక్‌లో పడతాయని చెబుతున్నారు. కానీ డబ్బులు రాలేదు' అని యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన రైతు కర్రెనాయక్ తన ఆవేదనను వెల్లిబుచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 3 వేల మంది, వికారాబాద్‌లో 8 వేల మందికి ధాన్యం డబ్బులు రావాల్సి ఉంది.
రెండు వారాల్లో పూర్తి స్థాయిలో చెల్లిస్తాం..
వికారాబాద్ జిల్లాలో రూ.220 కోట్ల ధాన్యం బిల్లులకు ప్రస్తుం రూ.170 కోట్లు చెల్లించాం. రాష్ట్ర కేంద్రం నుంచి రెండు వారాల నిధులు రాలేదు. మూడ్రోజుల కింద కొంత ఫండ్ వచ్చింది. వాటిని రైతులకు ఇస్తున్నాం. రెండు వారాల్లో పూర్తిగా చెల్లిస్తాం.
విమల- జిల్లా మార్కెటింగ్ అధికారి
20 రోజులైంది..
మార్కెట్లో ధాన్యం విక్రయించి 20 రోజులైంది. ఇప్పటికీ డబ్బులు రాలేదు. అప్పులోళ్లు తిరిగిపోతున్నారు. వారికి సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నా.. యాసంగి సాగుకు పెట్టుబడి లేక ఇప్పటికీ తూకం పోయలేదు. విత్తనాలకు కూడా డబ్బులు లేవు. మళ్లీ అప్పు తెచ్చి వేద్దామన్నా.. వ్యాపారులు ఇచ్చే పరిస్థితి లేదు. వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలి.
కృష్ణయ్య- గట్టుపల్లి