Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొండెం, తల వేర్వేరు ప్రాంతాల్లో లభ్యం
- 25న అదృశ్యం.. 26న బీడీఎల్ పోలీస్ స్టేషన్లో కేసు
- వెలిమెల తండాలో విషాదఛాయలు
నవతెలంగాణ-పటాన్చెరు/ రాయికోడ్
అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని తల, మొండెం వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాల్టీ పరిధిలోని వెలిమెల తండాకు చెందిన కడావత్ రాజు(32) ఈనెల 25 నుంచి కనిపించడం లేదని అతని సోదరుడు గోపాల్ 26న బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తులు రాజును అతి కిరాతకంగా హత్య చేసి తల, మొండెం వేరు చేశారు. రాయికోడ్ మండల పరిధిలో గల కుస్నుర్ వాగులో తల, మనూరు మండలం పుల్కుర్తి మంజీరా బ్యాక్ వాటర్ బ్రిడ్జి వద్ద మొండెంను పడేశారు. పోలీసులు గుర్తించి లభ్యం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార గొడవలే హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. బానూరు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. రాజు రెండు లారీలను నడపడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజు హత్యతో తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.