Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యపోరాటాల్లోకి రావాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
- కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయించాలి
- లేకుంటే బీజేపీని గద్దె దింపుతాం
- రిజర్వేషన్ల నిర్వీర్యం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ సరిగాదు :ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అడిగితే నిధులు ఇచ్చే స్థితిలో లేదనీ, కొట్లాడితేనే అవి వస్తాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ప్రభుత్వరంగాన్ని కాపాడుకునేందుకు, రిజర్వేషన్ల నిర్వీర్యాన్ని అడ్డుకునేందుకు ప్రజలంతా ఐక్యపోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ కాచిగూడలో గల ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజకీయపార్టీలు, 82 బీసీ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. అందులో ఎస్.వీరయ్య మాట్లాడుతూ..రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్లు పేరుకు మాత్రమే ఉన్నాయనీ, వాటివల్ల వృత్తిదారులకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. గత కేంద్ర బడ్జెట్లోనూ రూ.1000 కోట్లే కేటాయించారనీ, వాటిని కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో అనేక పోరాటాల ఫలితంగా ఎమ్‌బీసీ కార్పొరేషన్ ప్రారంభమైందనీ, దానికి నిధుల్లేవని చెప్పారు. చేద్దామన్నా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో పైసలు లేని పరిస్థితి నెలకొందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలోనూ అదే దుస్థితి దాపురించిందన్నారు. జీఎస్టీ పేరుతో కేంద్రం తన గుప్పిట్లోకి వనరులను లాక్కోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. బడుగు, బలహీన సామాజిక తరగతులకు ఉద్యోగవకాశాలు స్థిరంగా లభించింది ప్రభుత్వరంగంలోనేననీ, ఇప్పుడు దాన్నీ ప్రయవేటీకరించాలని చూడటం దారుణమని విమర్శించారు. సీపీఐ కేంద్రకార్యవర్గసభ్యులు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నదని విమర్శించారు. వారికి ఇతోధికంగా ఉపయోగపడుతున్న పలు పథకాలకు, స్కాలర్షిపులకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. నీరవ్‌మోడీ, విజరుమాల్యా, నీరేష్పరేఖ్, విక్రమ్ కొటారి, బిపిన్ దోహ్రా, ఎస్కే.జైన్, తదితర కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలను బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణాలిచ్చాయనీ, వారు ఆ డబ్బులను కట్టకున్నా ఏమి చేయట్లేదన్నారు. అదే సమయంలో బీసీలకు ఉపాధి పథకాల కోసం రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణాలను ఇచ్చేందుకు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..బడ్జెట్లో బీసీలకు లక్ష కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరారు. రిజర్వేషన్లను నిర్వీర్యం చేసే కుట్రను మోడీసర్కారు విరమించుకోవాలనీ, లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దేశానికి ఎస్సీ రాష్ట్రపతి, బీసీ ప్రధాని ఉంటే ఆయా సామాజిక తరగతులకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. ఆ రెండు అంశాలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటున్నదని విమర్శించారు. బీసీలకు న్యాయం చేయాలని స్వయంగా అడిగితే.. 'నీవు చెప్పింది చేస్తే కుర్చీ పోతుందయ్యా' అని మోడీ అన్నారంటూ గుర్తుచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ బీసీల సమస్యలు ప్రస్తావిస్తే...'ఆర్ఎస్ఎస్, బీజేపీ దానికి అంగీకరించవయ్యా'' ఆయన అన్నాడని చెప్పారు. అలాంటి బీజేపీ అధికారాన్ని కోల్పోయేలా ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ..మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తూ పోతున్నదని చెప్పారు. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఇతర వెనుకబడిన సామాజిక తరగతులకు వారేనన్నారు. ఫలితంగా 24 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎమ్వీ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేశ్, ఆమ్ఆద్మీపార్టీ నేత ఇందిరా శోభన్, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గుజ్జకృష్ణ, కోలా జనార్ధన్, లాల్‌కృష్ణ, నీల వెంకటేశ్, అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.