Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి
- వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్
- ఎక్కడికక్కడ అరెస్టులు
నవతెలంగాణ విలేకరులు
''ఎన్నికల ముందు చెప్పినట్టు.. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి.. నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. గద్దెనెక్కాక ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు. నిరుద్యోగులు బలవుతున్నా సీఎం కేసీఆర్‌కు పట్టదా..'' అంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. కొన్ని చోట్ల ముందస్తుగానే అరెస్టు చేశారు.
మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ను కాంగ్రెస్ యువజన నాయకులు ముట్టడించి.. కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. కాగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి తదితరులు పరామర్శించారు.ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ క్యాంప్ కార్యాలయాన్ని నాయకులు ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. మణుగూరులో ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యాలయ ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.