Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు కంపెనీలతో 'మెఘా'కు సంబంధాలు
- తాజ్ గ్రూపు ఫలక్‌నుమాతో పాటు లగ్జరీ హౌటళ్లలో వివాహ విందులు
- ఓ ఆంగ్ల వార్త సంస్థ కథనం
- తోసిపుచ్చిన రజత్, మెఘా
- స్పందించని ప్రభుత్వం
- ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: తమ్మినేని
'' అధికార దుర్వినియోగం ఎన్ని రకాలుగా చేయవచ్చో ఈ పెండ్లి ఒక సాక్ష్యం. గతంలో తాను చేసిన మేలుకు మరో రూపంలో సహకారం తీసుకున్న సాగునీటి పారుదల ఉన్నతాధికారి మీడియాకు చిక్కారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు.''
హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్‌కుమార్ (ఐఏఎస్) కూతురు పెండ్లి రాష్ట్రంలో సంచలనాలకు దారి తీస్తున్నది. గతేడాది డిసెంబర్లో ఆయన కూతురు పెండ్లి వేడుకలు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా విలాసవంతమైన తాజ్ గ్రూపునకు చెందిన ఫలక్‌నుమా ప్యాలెస్‌తో పాటు తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్ వంటి హౌటళ్లలో జరిగింది. దీనికి సంబంధించిన 'క్విడ్‌ప్రోకో' కథనాన్ని ఇంగ్లీషు వార్తా సంస్థ 'ది న్యూస్ మినిట్' వెబ్సైట్ ప్రముఖంగా ప్రచురించింది. అతిథులకు తేనీరు నుంచి పసందైన లంచ్, డిన్నర్లతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ 'రాయల్' పెండ్లికి అయిన ఖర్చును మెఘా కంపెనీ (మెయిల్)తో సంబంధమున్న రెండు షెల్ కంపెనీలు భరించినట్టు ఆ కథనంలో పేర్కొన్నది. ఈ వార్తలను రజత్‌కుమార్‌తో పాటు మెఘా సంస్థ కొట్టిపారేసింది. తాజ్ గ్రూపు కూడా చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసేందుకు విముఖతను చూపెట్టడంతో ఈ అంశం రాజకీయంగా దుమారాన్ని రేపుతుంది. ఈ వార్తా కథనం ప్రకారం.. ఈ వివాహ వేడుకకు వందలాది మంది అతిథులు హాజరయ్యారు. వీరందరికీ హైదరాబాద్‌లో అగ్రశ్రేణి విలాసవంతమైన ఐదు నక్షత్రాల హౌటళ్లుతాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్‌లో విందు వినోదాలు ఏర్పాటు చేశారు. ఈ ఖరీదైన పెండ్లికి అయిన మొత్తం ఖర్చులో సింహభాగాన్ని బిగ్‌వేవ్ ఇన్ఫ్రా ప్రయివేటు లిమిటెడ్ అనే కంపెనీ భరించింది. ఈ కంపెనీ చిరునామా హైదరాబాద్‌లోని బహదూర్‌పురలోని ఓ నివాసగృహం పేరుపై ఉంది. గత ఏడాది డిసెంబర్ 17 నుంచి 21వ తేదీ మధ్య ఈ వివాహ కార్యక్రమాలు జరిగాయి. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్)కు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు ఈ పెండ్లికి సంబంధించిన ఏర్పాట్లలో రజత్‌కుమార్‌కు సహకరించినట్టు సమాచారం. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు పలు నిర్మాణ పనులను మెఘా సంస్థ కొనసాగిస్తున్నది. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రస్తుత విలువ రూ. 1.15 లక్షల కోట్లని అంచనా. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ ఇరిగేషన్ ప్రాజెకు ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించే ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు రజత్‌కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కూతురి పెండ్లి ఖర్చు వివాదంతో కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు, ఆ శాఖను పర్యవేక్షిస్తున్న అధికారికి మధ్య ఉన్న అనధికారిక సంబంధాన్ని బహిర్గత పరిచే పత్రాలను సైతం ఆ వెబ్సైట్లో పెట్టారు.
ఏర్పాట్లలో 'మెఘా' ఉద్యోగులు
తాజ్గ్రూపునకు చెందిన ఖరీదైన హౌటళ్లలో పెండ్లికి సంబంధించిన కార్యక్రమాలకు కాంట్రాక్టులు, బుకింగ్‌లు, పేమెంట్లలో మెఘా సంస్థ ఎగ్జిక్యూ టివ్‌లు కీలకంగా వ్యవహరించారు. దీనికోసం వారు కంపెనీ ఈ-మెయిల్ ఐడీలతో పాటు ఒక డమ్మీ ఈ-మెయిల్ ఐడీని కూడా వినియోగించారు. డమ్మీ ఈ-మెయిల్‌ను ప్రత్యేకంగా రజత్‌కుమార్ కూతురు వివాహ కార్యక్రమ సమన్వయం కోసమే సృష్టించారు. తొలుత ఈ డమ్మీ ఈ-మెయిల్‌ను ఉపయోగించగా.. ఆ తర్వాత దశల్లో హౌటల్ స్టాఫ్‌తో కమ్యూనికేషన్ కోసం మెఘా ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి చెందిన ఈ-మెయిల్స్‌నే వాడారు.
ఇదెలా...?
గతేడాది జులై 31న హౌటల్‌లోని బ్యాంకెట్ హాళ్లు, రూమ్‌ల అడ్వాన్స్ బుకింగ్ కోసం 'బుకింగ్స్ హైదరాబాద్' అనే జీ మెయిల్ అకౌంట్‌ను వినియోగించారు. ఈ మెయిల్ మెఘా కంపెనీకి చెందిన 'మురళి' పేరుతో సైన్ ఆఫ్ అయింది. అతనితో పాటు మెయిల్ ఎగ్జిక్యూటివ్ టీ ప్రమీళన్ కూడా వివాహానికి సంబంధించిన బుకింగ్స్, ఇన్వాయిస్లు, పేమెంట్లు చేశారు.
బ్రేక్‌ఫాస్ట్ టూ డిన్నర్.. అన్నీ లగ్జరీవే..!
డిసెంబర్ 17న ఆల్ ఫ్రెస్కోను లంచ్ కోసం, హై టీ కోసం లగ్జరీ సూట్, డిన్నర్ కోసం చాంబర్స్ లాన్ ను మురళీ బుక్ చేశారు. డిసెంబర్ 18న గార్డెన్ రూమ్‌లో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ల కోసం బుక్ అయ్యాయి. లంచ్‌కు అల్ ఫ్రెస్కో లాన్‌ను బుక్ చేశారు. డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో భోజనాల కోసం తాజ్ కృష్ణలోని ఇతర వేదికలను బుక్ చేశారు. డిసెంబర్ 20న తాజ్ ఫల్నుమాలో తన కూతురు పెండ్లిలో 70 మంది అతిథుల కోసం రజత్‌కుమార్ అత్యంత ఖరీదైన డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు ఒక్కో గెస్ట్‌కు రూ. 16,520 చొప్పున ఫలక్‌నుమా ప్యాలెస్ చార్జి చేసింది.
బిగ్వేవ్కు రూ. 23 లక్షల బిల్లు
ఈ పెండ్లి వ్యవహారంలో మెఘా కంపెనీ హౌటళ్లకు దాదాపు రూ. 50 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. దీనికోసం షెల్ కంపెనీలైన ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్, బిగ్‌వేవ్ ఇన్ఫ్రా ప్రయివేటు లిమిటెడ్ అనే రెండు కంపెనీల పేరు మీద ఇన్వాయిస్లను ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందులో బిగ్‌వేవ్ ఇన్ఫ్రా 2021 జూన్‌లో ఏర్పాటైంది. ఇక ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్‌కు చెందిన డైరెక్టర్లు మెయిల్ కంపెనీలలోనూ డైరక్టర్లుగా ఉన్నారు. చెల్లింపుల్లో రూ. 23 లక్షలను బిగ్వేవ్కు బిల్ చేశారు. కాగా, తొలుత ఈ బుకింగ్‌లకు సంబంధించి రజత్ కుమార్ చర్చలు జరపగా.. ఆ తర్వాత మెయిల్ ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి ఓఎస్డీ ప్రభాకర్ రావు అన్ని ఏర్పాట్లను చూశారని సమాచారం.
ఆ రెండు కంపెనీలను నడుపుతున్నదెవరు?
ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్ 2010 జూన్‌లో ఏర్పాటైంది. ఈ కంపెనీకి పురిటిపాటి సుమలత ఎండీగా ఉన్నారు. వెంకట సుబ్బారెడ్డి పురిపాటి డైరెక్టర్‌గా, చింతపెల్లి కృష్ణవేణి అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే, వీరిద్దరూ.. మెఘా గ్రూపునకు చెందిన పలు ఇతర కంపెనీలకూ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక బిగ్‌వేవ్ ఇన్ఫ్రా ప్రయివేటు లిమిటెడ్ 2021 జూన్‌లో ఏర్పాటైంది. సంధ్యా అగర్వాల్, అనూషలు ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే, ఈ కంపెనీ చిరునామా మాత్రం బహదూర్‌పురలో గల ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఉన్నది. దీనిపై సంధ్యను ప్రశ్నించగా.. తమ కంపెనీ చిరునామా ఆ ఇంటిపేరుపై ఉన్నప్పటికీ.. తమ కంపెనీ మాత్రం వేరొక చోట ఉన్నదని చెప్పుకొచ్చారు.గదుల బుకింగ్, ఫంక్షన్స్ కోసం రూ. 50 లక్షలుగా తొలుత పేర్కొన్నారు. ఇందులో రూ. 23 లక్షలను బిగ్‌వేవ్ చెక్‌ద్వారా చెల్లించింది. అయితే, ఈ వివాహానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం వెల్లడించడానికి తాజ్ గ్రూప్ తిరస్కరించింది. మరోపక్క, బిగ్‌వేవ్ కూడా చెల్లింపును ధృవీకరించలేదు.
తోసిపుచ్చిన రజత్, మెఘా
కాగా, ఈ అంశంపై బిగ్‌వేవ్ రూ. 23 లక్షలను చెల్లించిందన్న వార్తలను రజత్‌కుమార్ తోసిపు చ్చారు. ఇదంతా అవాస్తవమనీ, ఆ కంపెనీ పేరును తానెప్పుడూ వినలేదని చెప్పారు. మెయిల్ బుకింగ్స్ వంటివేవీ చేయలేదనీ, అన్నీ తానే వ్యక్తిగతంగా చేసినట్టు చెప్పారు. కాగా, ఈ వార్తలకు సంబం ధించిన పత్రాలన్నీ కల్పితమనీ, వెడ్డింగ్‌తో కంపెనీకి ఎలాంటి సంబంధమూ లేదని మెయిల్ జనరల్ మేనేజర్ (పబ్లిక్రిలేషన్) ఎం. శివారెడ్డి తెలిపారు. తమ కస్టమర్లకు సంబంధించిన సమాచారాన్ని తాము షేర్ చేయబోమని తాజ్ గ్రూపు పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ శంతల జైన్ వివరించారు. రజత్‌కుమార్ కూతురి పెండ్లి విషయంలో వివాదం రాజకీయంరంగు తీసుకొని ముదురుతున్నా, ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి : తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్ కుమార్తె పెండ్లి ఖర్చు విషయంపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తున్నది. దీనిపై తక్షణం విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాలి. ప్రజలకు వాస్తవాల్ని వెల్లడించాలి.