Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నెరవేర్చాలి
- కాజీపేట చౌరస్తాలో అఖిలపక్షం రాస్తారోకో
నవతెలంగాణ-కాజీపేట
రానున్న బడ్జెట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాపు, పీఓహెచ్ల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చాలని హనుమకొండ జిల్లాలోని కాజీపేట చౌరస్తాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ మాట్లాడుతూ.. కాజీపేటకు రైల్వే పరంగా అన్ని విధాల నష్టం జరుగుతుందన్నారు. కాజీపేటకు మంజూరైన వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ పనులను వెంటనే చేపట్టాలన్నారు. వ్యాగేన్ రిపేర్ వర్క్‌షాప్‌కు అవసరమైన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించినా.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్లో కాజీపేటకు నిధులు కేటాయించకపోతే పోరాటాలకు సిద్ధమవుతామనాన్నరు. సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య, డీసీసీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా ఉన్న కాజీపేట ప్రాంతం రైల్వే పరంగా అభివృద్ధి చెందడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కాజీపేట ప్రాంతంపై వివక్ష చూపిస్తోందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పలు రైల్వే పనులకు హామీ ఇచ్చిన.. అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో కాజీపేట ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నిరాశనే మిగిలుస్తోందన్నారు. రానున్న బడ్జెట్లో కాజీపేట ప్రాంతానికి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మెన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, మాజీ కూడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు దాస్యం విజరు భాస్కర్, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీరాజాలి, సంకు నర్సింగరావు, ఎలకంటి రాములు, మాజీ కార్పొరేటర్ తోట్లా రాజు యాదవ్, సీపీఐ(ఎం), సీపీఐ, తెలంగాణ జన సమితి, టీటీడీపీ, టీఎమ్మార్పీఎస్, న్యూడెమోక్రసీ, రైల్వే మజ్దూర్ యూనియన్, వర్తక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.