Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- కోవిడ్ నిబంధనలు అమలు చేయండి : మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల ఎనిమిది నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరగడంతో వైద్యఆరోగ్య శాఖ సిఫారసు మేరకు ఈనెల 31 వరకు వాటిని పొడిగించింది. తాజాగా రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గడంతోపాటు, పొరుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలోనూ విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను వచ్చేనెల ఒకటి నుంచి పున:ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆమె ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చేనెల ఒకటి నుంచి విద్యాసంస్థలను పున:ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, గురుకుల విద్యాసంస్థలతోపాటు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వచ్చేనెల ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను వచ్చేనెల ఒకటి నుంచి ప్రారంభించాలని డీఐఈవోలు, ప్రిన్సిపాళ్లను ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కోరారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. తరగతి గదులు, ల్యాబోరేటరీలు, హాస్టళ్లను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కోరారు. వచ్చేనెల ఒకటి నుంచి అధ్యాపకులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలనీ, వారికి బయోమెట్రిక్ హాజరు ఉంటుందని వివరించారు.
స్వాగతించిన టిప్స్
జూనియర్ కాలేజీలను వచ్చేనెల ఒకటి నుంచి పున:ప్రారంభించడాన్ని తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్) స్వాగతించింది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య శనివారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. 317 జీవో ప్రకారం ఉద్యోగుల విభజనలో ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు లెక్చరర్లకు నష్టం కలగకుండా తిరిగి వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల అప్పీళ్లను పరిష్కరించాలనీ, స్పౌజ్, ప్రత్యేక కేటగిరీ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు.
సీఎంకు కృతజ్ఞతలు : ట్రస్మా
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వచ్చేనెల ఒకటి నుంచి విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల మ్యుమంత్రి కేసీఆర్‌కు ట్రస్మా అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి కోశాధికారి శ్రీకాంత్‌రెడ్డి నాయకులు చింతల రాంచందర్, ఆరుకాల రామచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ వల్ల నానాటికీ చదువులకు దూరమవుతున్న విద్యార్థులకు జరుగుతున్న తీవ్ర నష్టాన్ని అరికట్టేలా వారి భవిష్యత్తును కాపాడాలని మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు.