Authorization
Tue April 08, 2025 11:52:52 am
- కార్మికులకు తక్షణమే బకాయిలను చెల్లించాలి : తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజారవాణ సంస్థ అయిన ఆర్టీసీ విషయంలో లాభ-నష్టాల వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం విడనాడి బస్సుల సంఖ్యను పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని కోరింది. వారి పనిభారాన్ని తగ్గించి, ఉద్యోగ రక్షణ కల్పించాలనీ, రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించి ఆర్టీసీని బలోపేతం చేయాలని సూచించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ సుమారు కోటి మంది పేద, మధ్యతరగతి ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్దపెట్టడం లేదని విమర్శించారు. సంస్థను క్రమంగా బలహీనపరుస్తూ నష్టాల్లోకి నెడుతున్నదని తెలిపారు. రీయింబర్స్మెంట్స్ సకాలంలో ఇవ్వడంలేదని పేర్కొన్నారు. కార్మికుల పీఎఫ్ డబ్బులనూ వాడుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ కార్మికుల చెల్లింపులను ఆపిందని తెలిపారు. పింఛన్, సీసీఎస్ రుణాలను జాప్యం చేస్తున్నదని విమర్శించారు. సర్వీస్‌లో ఉండి చనిపోయిన సుమారు 600 మంది కార్మిక కుటుంబాలకు ఇన్స్యూరెన్స్ డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. నాలుగేండ్లకోసారి జరగాల్సిన వేతనసవరణ రెండు దఫాలుగా పెండింగ్ పెట్టిందని తెలిపారు. ఐదు విడతల డీఏను నిలుపుదలచేసిందని వివరించారు. రాష్ట్రంలో 12,765 గ్రామ పంచాయితీలుంటే కేవలం 9,377 గ్రామ పంచాయితీలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉందని తెలిపారు. 3,388 గ్రామ పంచాయితీలకు ఆ సౌకర్యం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిస్థితి ఘోరంగా తయారైందని తెలిపారు. 2019లో 3,700 బస్సులు నడుపుతుంటే ఆర్టీసీ సమ్మె అనంతరం 2020, జనవరిలో వాటి సంఖ్యను 800కు తగ్గించారని వివరించారు. ఇటీవల కాలంలో రీ-షెడ్యూల్ పేరుతో సర్వీసులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్న డిపోలను తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులపై పనిభారం పెరగడం, కాలం చెల్లిన బస్సులను నడుపుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల కార్యకలాపాలపై ప్రభుత్వం నిషేధం విధించిందనీ, రెండేండ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు కనబడడంలేదని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని హైదరాబాద్, జిల్లాల్లో బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.