Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నాలు
- స్థానికత కోల్పోయిన టీచర్లకు న్యాయం చేయాలి
- ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో మహాధర్నా
- రాజకీయాలు మాని సమస్యలు పరిష్కరించండి
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ- విలేకరులు
జీఓ 317లో ఉన్న లోపాలను సవరించి నష్టపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవోను వెంటనే లోపాలను సవరించి టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఓబెదుల్లా కోత్వాల్ మద్దతు తెలిపారు. నాగర్‌కర్నూల్, వనపర్తి కలెక్టరేట్ల ఎదుట టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు.
రాజకీయాలు మానుకుని కేడర్ విభజన వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట హనుమకొండ, వరంగల్ ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. స్థానికత కోల్పోయిన టీచర్లను స్థానిక జిల్లాలకే కేటాయించాలన్నారు. భార్యాభర్తలను ఒకే కేడర్‌లోకి మార్చడం, వితంతువులు, ఒంటరి మహిళలను ప్రాధాన్యత ప్రకారం కేటాయించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం బాధ్యతను తనకు అప్పగిస్తే పరిష్కరించి చూపెడతానని ఎప్పారు. అవకతవకలపై వచ్చిన అప్పీల్స్‌ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు టి.లింగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏకపక్షంగా పోవడం వల్లే అన్ని సమస్యలకు మూలం అయిందన్నారు. యూఎస్పీసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిస్తే పరిష్కారాలు చూపెడతామన్నారు. ఈ కృషి ప్రభుత్వం చేయకపోతే ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో ఉపాధ్యాయుల మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ఏఓ అరవింద్‌కు వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ఏఓ రఫత్ హుస్సేన్‌కు వినతిపత్రం అందించారు. ధర్నాకు యువజన సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు.
రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. వికారాబాద్‌లో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. వీరికి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు.
నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్ల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఉద్యోగుల అభ్యంతరాలను, అభ్యర్థనలను పట్టించు కోకుండా కేటాయింపులు జరిపినందున పలువురు ఉద్యోగులు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారని, సీనియారిటీ జాబితాలు సమగ్రంగా తయారు చేయలేదన్నారు.
ఉపాధ్యాయుల సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. టీజేఎస్, సీఐటీయూ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.వీరారెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో ధర్నాకు గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎండి జావీద్, బీఎస్పీ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. కొత్తగూడెంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది.