Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయలక్ష్మి తప్పుచేసినట్టు నిర్ధారణ
- డాబ్రియేల్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆమె వ్యవహారం : పీసీసీఎఫ్ శోభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆటవీశాఖ ఉన్నతాధికారులపై ఉద్యోగి జయలక్ష్మి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీసీసీఎఫ్ డాబ్రియేల్, ఇతర ఉన్నతాధికారుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆమె తీరు ఉందని విమర్శించారు. నిజామాబాద్ డివిజన్లో పనిచేసినప్పుడు ఆమెపై అనేక ఫిర్యాదులు వచ్చాయనీ, వాటిపై విచారణ జరిపితే ఆమె తప్పు ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోకుండా తనపైన వచ్చిన ఫిర్యాదులు, వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు జయలక్ష్మి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల విధులు, బదిలీలు, పోస్టుల కేటాయింపులన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతాయనే విషయాన్ని అందరూ గుర్తెరుగాలని కోరారు. వ్యక్తిగతంగా లబ్ది పొందేందుకు ఆమె ఇలా వ్యవహరించటాన్ని, ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదుపై స్పందించామనీ, అంతర్గత కమిటీ ద్వారా మహిళా అధికారులతోనే విచారణ కూడా జరిపించామని పేర్కొన్నారు. ఆమె ఆరోపణల్లో నిజం లేదని అక్కడా నిరూపితమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగపరంగా డాబ్రియేల్తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదనీ, సదరు అధికారి పర్యవేక్షణలో పనిచేయడం లేదని తెలిపారు. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులపై నిరాధార ఆరోపణలు చేసిన జయలక్ష్మిపై శాఖాపర చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డాబ్రియేల్పై ఆరోపణల్ని ఖండిస్తున్నాం :టీఎస్ఎఫ్ఓఏ
పీసీసీఎఫ్ డాబ్రియేల్పై జయలక్ష్మి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర అటవీ అధికారుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎమ్.రాజా రమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమెపై డాబ్రియేల్ వేధింపులకు పాల్పడ్డాడనే ప్రచారం అవాస్తమని కొట్టిపారేశారు.