Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీవీ వెబినార్లో ప్రొఫెసర్ సంతోష్ కుమార్ రారు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతిపిత మహాత్మాగాంధీ సూచించిన అహింసా సిద్ధాంతం సార్వజనీనమైనదే కాక, సర్వ కాలాలకు అవసరమైందని ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ రారు తెలిపారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 'మహాత్మాగాంధీ-అన్ని సమయాలకు, అన్ని స్థలాలకు' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఆధునిక కాలంలో హింస సాంకేతికను కూడా ఉపయోగించుకుని రూపం మార్చుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుకొని ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను వివరించారు. జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం కట్టుబడ్డ మహనీయునిగా గాంధీ చరిత్రలో నిలిచిపోయారన్నారు. గాంధీ స్ఫూర్తితో అహింసా మార్గంలో నెల్సన్ మండేలా సౌతాఫ్రికా స్వాతంత్య్రం కోసం పోరాడి విజయం సాధించిన విషయాన్నిగుర్తుచేశారు. నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న పారిశ్రామికీకరణ కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలను గాంధీ ఆప్పుడే అంచనా వేశారని తెలిపారు. దేశ వైవిధ్యాన్ని కాపాడేందరుకు జీవితం అర్పించారని తెలిపారు. పేదరికం పోవాలని గాంధీ ఆకాంక్షించారని చెప్పారు. ఆధ్యాత్మికత నుంచి అలవర్చుకున్న సత్యాగ్రహ పోరాటం స్వాతంత్య్రపోరాటంలో కీలకంగా మార్చగలిగారని తెలిపారు.
ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసమున్న గాంధీ ఆలోచనలు నేటి సమాజానికి అవసరమని అభిప్రాయపడ్డారు. వెబినార్లో జన విజ్ఞానవేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బి.ఆర్.రాహుల్, తెలంగాణ అధ్యక్షులు కోయ వెంకటేశ్వర్ రావు, జేవీవీ నాయకులు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, జేవీవీ నాయకులు వి.బాలసుబ్రమణియన్ తదితరులు పాల్గొన్నారు.