Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్
- ప్రభుత్వాలేవైనా..సంఘాల చైతన్యం అవసరం : ఈటల
- హైదరాబాద్‌లో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామగ్రామానికి పోయి ప్రభుత్వ భూములెక్కడున్నాయి? అసలు సమస్యలేంటి?, తదితరాలన్నింటినీ కష్టపడి వెలుగులోకి తెచ్చింది రెవెన్యూ ఉద్యోగులేననీ, అందులో తహసీల్దార్ల పాత్ర కీలకమైనదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. భూముల లొసుగులు, లోతుపాతులు అర్థమయ్యే దాకా ఆ శాఖ ఉద్యోగులను వాడుకుని కేసీఆర్ వదిలేశారని విమర్శించారు. తిరిగి వారిపైనే అవినీతిశాఖ అనే ముద్ర వేయించిన చరిత్ర ఆయనదన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్(టీజీటీఏ) డైరీని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి ఎస్పీఆర్ మల్లేశ్‌కుమార్, బీజేపీ నాయకులు అశ్వథామరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. కోదండరామ్ మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లంతా నేడు కేసీఆర్ చుట్టూ చేరారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదన్నారు. ఆనాటి ఉద్యమంలో స్థానికత కూడా ఒక ప్రధాన అంశమన్నారు. నేడు జీవో 317 ద్వారా స్థానికతకు పాతరేసి ఇష్టానుసారంగా బదిలీలు చేశారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులెవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే ఎక్కడో మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసి వేధిస్తున్న పరిస్థితి నేడు నెలకొందన్నారు. ఉద్యోగులంతా గమ్ముగా ఉంటే కేసీఆర్‌ను సమర్ధిస్తున్నట్టు కాదనీ, సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్వరాష్ట్రంలోనూ రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ..ప్రభుత్వాలు ఏవి ఉన్నప్పటికీ ఎల్లవేళలా సంఘాలు చైతన్యంగా ఉండాలనీ, లేనిపక్షంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. తన సొంత ప్రయోజనాల కోసం రెవెన్యూ శాఖపైనే సీఎం కేసీఆర్ అవినీతి ముద్ర వేయించారనీ, ఇలా దేశంలో ఎక్కడా జరిగి ఉండదని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవ ప్రతీక భూమి అనీ, దాని జోలికొస్తే సహించరని అన్నారు. లక్షలాది మంది భూములను నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమన్నారు. బాధలు చెప్పుకుందామంటే రెవెన్యూ శాఖకు మంత్రి లేడు..సీసీఎల్ఏ లేరు...సీఎం, సీఎస్‌ను కలుద్దామంటే అనుమతివ్వని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. అంతిమంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ను కేసీఆర్ అనాథ శాఖగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ 20 ఏండ్లు వెనక్కిపోయిందన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.