Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్ తప్పుల తడకగా మారిందనీ, ప్రభుత్వ తప్పిదాల వల్ల భూమున్నా రైతుబంధు, ఇతర లోన్లు రాని పరిస్థితి నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడమేంటని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 'రెవెన్యూ చట్టాలు-ధరణిలో లోపాలు' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అందులో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం వందల కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర నిధులును దారి మళ్లిస్తూ తన కుటుంబం, బినామీ సంస్థలకు ఉపయోగపడేలా 'ధరణి' పోర్టల్ ను తీర్చిదిద్దడం దురదృష్టకరమన్నారు. అసైన్డు భూముల రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని హైకోర్టు రెండు సార్లు తీర్పులిచ్చినా పట్టించుకున్న దాఖలాల్లేవని విమర్శించారు. ధరణి బాధ్యతలను నైపుణ్యమున్న సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సీఎం స్పందించి ధరణి పోర్టల్‌లోని సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాంగోపాల్ మాట్లాడుతూ..ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేయకపోతే ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుతుందని హెచ్చరించారు. అసైన్డ్ భూములకు శాశ్వత హక్కుల సాధన సంఘం నాయకులు గుమ్మి రాజుకుమార్రెడ్డి, మన్నె నర్సింహారెడ్డి మాట్లాడుతూ..అసైన్డ్ భూములు సాగుచేసుకుంటున్న 14 మంది రైతుల్లో దళితులు, గిరిజనులే ఎక్కువన్నారు. అసైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని కోరారు.