Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఐ సాధనకమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్
- సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
నవతెలంగాణ-విద్యానగర్
రానున్న బడ్జెట్లో సీసీఐకి నిధులు కేటాయించాలని సీసీఐ సాధనకమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎన్నో ఏండ్లుగా తలమానికంగా ఉండి, మూతపడ్డ సీసీఐని పున:ప్రారంభించేందుకు కృషిచేస్తున్న సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ ఫ్యాక్టరీ సమీపంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఆదిలాబాద్ ఎంపీ కృషిచేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నాల్గో తేదీన చేపట్టిన పట్టణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు దేశంలోనే అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా కేవలం వ్యవసాయంపై ఆధారపడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ యువతకు ప్రత్యక్షంగా రెండు వేల ఉద్యోగాలు, పరోక్షంగా అనేక ఉద్యోగాలు కల్పించే సీసీఐకి కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు కేటాయించాలన్నారు. పుష్కలమైన ముడిసరుకు, రోడ్డు, రైలు సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ పరిశ్రమను మూసివేయడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. రానున్న 2022 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫిబ్రవరి 4న నిర్వహించే ఆదిలాబాద్ పట్టణ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిరాహార దీక్షకు ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మద్దతు పలికారు. నిరాహార దీక్షలో కో కన్వీనర్లు నారాయణ, నర్సింగ్, కొండ రమేష్, బండి దత్తాత్రి, అరవింద్, లంక రాఘవులు, భూ నిర్వాసితులు బొల్లు ఈశ్వర్, విఠల్, మాజీ కౌన్సిలర్ ప్రభ, మహిళా సంఘం నాయకురాలు మయూరిఖాన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, బొజ్జ ఆశన్న, సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు లంక జమున, శకుంతల, ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.