Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలి
- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
- ఫిబ్రవరిలో దశలవారీగా ఆందోళనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువతకు నష్టదాయకంగా ఉన్న జీవో నెంబర్ 317ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ, స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఫిబ్రవరి నెలలో దశలవారీగా పోరాటాలు చేస్తామనీ, న్యాయపరంగానూ ముందుకెళ్తామని రాష్ట్ర సర్కారును హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పురుషోత్తం, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు జి.నిర్మల, కోశాధికారి గడ్డం బాలస్వామి, రాష్ట్ర నాయకులు భోగ శ్రీనివాస్, జి ఆనంద్, యుఎఫ్ఏ యాకూబ్ పాషా, బొడ్డు ప్రసాద్, విఠల్, ఆనంద్ కలాల్, విజయ, అంజనీ కుమారి, రమ, నలినీ, జాజుల రంజిత్, గౌతంచారి, రేవంత్, కెంపుల నాగరాజు, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పి.పురుషోత్తం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఫిబ్రవరి ఏడోతేదీన సీఎస్‌కు, ఎనిమిదో తేదీన ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. పదోతేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. న్యాయపోరాటం కోసం 13న సుప్రీంకోర్టు అడ్వకేట్‌ను కలిసి చర్చిస్తామన్నారు. జీవో రద్దు కోసం 15న గవర్నర్‌ను కలుస్తామన్నారు. 20న ఇందిరాపార్కు వద్ద బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులతో దీక్ష చేపడతామని చెప్పారు. 22న కేంద్ర హోంమంత్రికి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. రెండు నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలనీ, వీఆర్వోలకు జాబ్‌చార్టు రూపొందించాలని విన్నవించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారులు వేధింపులను ఆపాలన్నారు. ఏపీలో పనిచేస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 క్యాడర్‌కు చెందిన తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించాలనీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.