Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ కార్మికుల దీనావస్థలు
- మల్టీఫర్పస్ పేరుతో శ్రమదోపిడీ
- అన్ని పనులు చేస్తున్నా అత్తెసరు జీతం
- ఆందోళనకు సిద్ధమవుతున్న 36,500 మంది వర్కర్లు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిది
ఊరుకంటే ముందు నిద్రలేచి...చెత్త సేకరణ ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి... లైసెన్స్‌లేని డ్రైవర్ వృత్తి చేపట్టి... 'చెత్తబండి వచ్చిందమ్మో...చెత్తబండి..తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి తేండమ్మో...' అంటూ పయనం మొదలుపెట్టి... పాచివాకిళ్ల చెత్తను సేకరించి...మురికి కాల్వలు శుభ్రం చేసి...ట్యాంకులకు నీళ్లు ఎక్కించి..ఊరంతా మంచినీళ్లు ఇచ్చి... పల్లె ప్రకృతి వనంలో మొక్కల దాహం తీర్చి..పంచాయతీ కార్యాలయంలో విధులు చక్కబెట్టి...సాయంత్రం వీధి దీపాలతో ఊరంతటికీ వెలుగులు నింపి...గ్రామంలో ఎవరైనా కాలం చేసినా...కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాని కరోనా శవాలకు అంత్యక్రియలు చేయాలన్నా...చనిపోయిన కుక్కలు, పశువుల కళేబరాలు ముక్కుపుటలు అదిరేలా వాసన వస్తున్నా...చెట్టూచేమ, మనిషి, పశువు...ఊరుమ్మడి పనంటే చక్కబెట్టాల్సింది గ్రామ పంచాయతీ కార్మికులే. ఊరు బాగు కోసం ఉరుకురుకి పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల దుస్థితి 'ఊరంత పనికి...గోరంత వేతనం'లా ఉంది.
'మల్టీపర్పస్ వర్కర్ల' పేరుతో శ్రమదోపిడీ
పంచాయతీ కార్మికులను సర్కారు బాండెడ్ లేబర్‌గా మార్చేసింది. గతంలో బిల్‌కలెక్టర్, కారోబార్, అటెండర్, పంప్ ఆపరేటర్, స్వీపర్లు ఇలా వేర్వేరుగా ఉంటే 'మల్టీపర్పస్ వర్కర్లు' అని కొత్తపేరుపెట్టి ఆ పని, ఈ పనికాదు...మొత్తం పనులన్నీ చేయాలంటోంది. ఏడాది పాటు పనితీరు బాగుంటేనే ఉద్యోగమని, లేదంటే ఇంటికేనని గతంలో వార్నింగ్ సైతం ఇచ్చింది. దీనికి సంబంధించి జీవోనంబర్ 51 సైతం తీసుకొచ్చింది. చాలీచాలని వేతనం, పనిభారంపై పంచాయతీ కార్మికులు 2019లో 33 రోజుల పాటు నిరవధిక సమ్మె చేయడంతో ప్రభుత్వం రూ.8,500 వేతనంగా నిర్ధారించింది. ఈ పని తమతో కాదన్నా...ఏడాది పనితీరు బాగోకున్నా...అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగం వదులుకోవాల్సిందే...అంటూ రూ.50 బాండ్ పేపర్‌పైన అప్పట్లో సంతకాలు సైతం తీసుకుంది. అరకొరవేతనంతోనే వీరితో విధులు చేయిస్తోంది.
జీవో నం. 60 ప్రకారం వేతనాల కోసం డిమాండ్
మల్టీపర్పస్ వర్కర్లుగా విచ్చలవిడి శ్రమదోపిడీకి గురవుతున్న పంచాయతీ కార్మికులు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాల చెల్లింపు, రోజుకు 8 గంటల పని విధానం అమలు చేయాలని ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్రంలోని 12,753 పంచాయతీల్లో కారోబార్, పంప్‌ఆపరేటర్ (వాటర్‌మన్), లైన్‌మన్, అటెండర్, స్వీపర్, కావల్దార్, సఫాయి తదితర పేర్లతో దాదాపు 36,500 మంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని పాత పంచాయతీల్లో 8,500 మంది కారోబార్లు, బిల్‌కలెక్టర్లుగా విధులు నిర్వహించేవారు. ఈ నౌకరీ చేస్తున్నవారంతా టెన్త్, ఆపై చదువులు చదువుకున్నవారే. వీరిలో అత్యధికులు డిగ్రీ, పీజీలు సైతం పూర్తి చేశారు. ఇంటి పన్నులు వసూలు చేయడం, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు పనుల్లో సహకరించడం వీరి విధి. ఎప్పుడైతే జీవో 51 ప్రకారం వీరిని మల్టీపర్పస్ వర్కర్లుగా పరిగణించారో నాటి నుంచి వీరు చెత్త ఎత్తడం, ట్రాక్టర్లు నడపడం, మొక్కలకు నీళ్లు పెట్టడం...ఇలా ఏ పనంటే ఆ పని చేయాల్సి వస్తోంది. 500 జనాభాకు ఒక కార్మికుడి చొప్పున 2,000 మంది ఉన్న గ్రామంలో నలుగురు, మూడువేల జనాభా ఉన్న చోట ఆరుగురు చొప్పున విధులు నిర్వహించాలని ఈ జీవో 51లో నిబంధన ఉండటంతో ఆ నిష్పత్తికంటే ఎక్కువ మంది ఉన్న చోట కార్మికులను తొలగించారు.కార్మికులకు సైతం చాలీచాలని వేతనాలు ఇస్తూ...పనిభారం మోపుతుండటంపై అప్పట్లో సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ కార్మికులకు పీఆర్సీ ప్రకారం జీవో నంబర్ 60ని అనుసరించి సీనియార్టీ, ఇతరత్ర అంశాల ప్రాతిపదికన రూ.15,600, రూ.19,600, రూ.22,700 చొప్పున వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాడు సమస్యలన్నీ పరిష్కరిస్తానని, వేతనం పెంపుదల చేస్తామని హామీ ఇచ్చిన సీఎం ఇంతవరకూ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై పంచాయతీ కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
పంచాయతీ కార్మికుల కోసం ఉద్యమిస్తాం
తెలంగాణ రాష్ట్రంలో జీతాలు పెరగని ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది గ్రామపంచాయతీ వర్కర్లు మాత్రమే. వీరి వేతనాల పెంపుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాలు, పేదలు అధికంగా ఉన్న జీపీ వర్కర్ల విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదు.
- పాలడుగు భాస్కర్, తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్
(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు.
మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో శ్రమదోపిడీ చేస్తున్నారు...
మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారు. నాకు ట్రాక్టర్ డ్రైవింగ్ రాదు, సర్పంచ్, వైస్ సర్పంచ్ డ్రైవింగ్ నేర్పించారు. లైసెన్స్ లేని నాతో డ్రైవింగ్ చేయి స్తున్నారు. కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తు న్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు మాకు 15,000కు పైగా వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
- చిలకల వీరభద్రం, గ్రామపంచాయతీ వర్కర్, ఆరెగూడెం, నేలకొండపల్లి.