Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని భూసేకరణ.. ఆందోళనలో రైతాంగం
- ఉనికి కోల్పోతున్న ఊర్లు ొ నర్సింహులపల్లి వరకు చేరిన తవ్వకం పనులు ొ కోర్టును ఆశ్రయిస్తున్న రైతులు
నవతెలంగాణ - గంగాధర
అదనపు టీఎంసీ వరదకాలువ భూసేకరణతో ఉన్న భూములు ఊడ్చుకుపోతుంటే.. ఊళ్లు ఉనికిని కోల్పోతున్నాయంటూ అడుగడుగునా అన్నదాతలు అడ్డుకుంటున్నారు.. అయినా పట్టువిడుపులేని అధికారులు భూసేకరణ సర్వే చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా పోయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. పరిహారం పెంపుతోపాటు ఇంటికో ఉద్యోగం, స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుంచి నుంచి మిడ్మానేరుకు నీరును చేర్చే మూడో విడత భూసేకరణ సర్వే ఓ వైపు కొనసాగుతుంటే.. మరో వైపు తవ్వకం పనులు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే వరద కాలువ, రైల్వేలైన్ల నిర్మాణాల్లో వందలాది ఎకరాల భూములను కోల్పోగా.. ఇప్పుడు అదనపు టీఎంసీ వరద కాలువ భూసేకరణతో ఉన్న ఊళ్లు, ఇండ్లు పోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాల్లోని 14 గ్రామాల్లో అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకంలో 639 ఎకరాల భూములు పోతున్నాయి. నీటిపారుదల శాఖ రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే సర్వే చేపట్టి భూములు సేకరించింది. అయితే, రైతులు, సర్వే నంబర్ల ప్రకారం భూసేకరణ సర్వేను పూర్తి చేసి అవార్డు చేయడానికి వీలుగా రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించే తంతు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామ గ్రామాన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గంగాధర మండలం ఆచంపల్లి గ్రామ రైతులు అదనపు టీఎంసీ వరద కాలువకు భూములివ్వబోమని కోర్టును ఆశ్రయించి ఏప్రిల్ 4 వరకు స్టే తెచ్చారు. తాడిజెర్రి రైతులు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయా గ్రామాల్లో భూసేకరణ నిలిచిపోయింది.
ప్రారంభమైన తవ్వకం పనులు
ఇప్పటికే సర్వే పూర్తి చేసి అవార్డు చేసిన భూముల్లో కాలువ తవ్వకం పనులు షురువయ్యాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనుకుని కొనసాగుతున్న తవ్వకం పనులు గంగాధర మండలం నందగిరి-కోట్ల నర్సింహులపల్లి శివారు వరకు చేరాయి. ప్రస్తుతం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణంతోపాటు కాలువ తవ్వకం పనులు జరుగుతున్నాయి.
ఒక్కో రైతుది ఒక్కో బాధ
నిర్వాసిత గ్రామాల్లో ఏ రైతును కదిపినా కన్నీరుమున్నీరవుతున్నారు. మెట్ట ప్రాంతమైన గంగాధర మండలంలో జీవనదిగా మారిన వరద కాలువ వల్ల బీడు భూములు సాగులోకి వచ్చాయని సంబరపడినంతలోనే.. పిడుగులా భూసేకరణ వచ్చింది. వరసగా చేపడుతున్న భూసేకరణలో భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అనేక మంది రైతులు కూలీలుగా మారుతున్నారు.
ఏం మిగలకుండా పోతోంది..
వరాల సుధాకర్- తాడిజెర్రి
ఒకప్పుడు 13 ఎకరాల ఆసామిని. వరద కాలువ, శ్రీపాద ఎల్లంపల్లి డిస్ట్రిబ్యూటరీ కెనాల్, మరోసారి చేపట్టిన అదనపు టీఎంసీ కాలువతో ఏం మిగలకుండా భూములు పోతున్నరు. ఇప్పటికే వరద కాలువలో నాలుగున్నర ఎకరాలు పోగా, శ్రీపాద ఎల్లంపల్లి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ తవ్వకంలో ఎకరన్నర పోయింది. మిగిలిన ఏడెకరాలు ఇప్పుడు వరద కాలువలో పోతోంది.
ఎవరి కోసం అదనపు టీఎంసీ వరద కాలువ
శ్రీరాం తిరుపతి- తాడిజెర్రి
ఉన్న భూములన్నీ వరద కాలువ తవ్వకాల్లో కోల్పోతుంటే ఎవరి కోసం అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకం చేపడుతున్నారు. ప్రభుత్వ అనాలోచి నిర్ణయం వల్ల భూములు కోల్పోయి మా కుటుం బానికి బతుకుదెరువు లేకుండా పోతంది.ఇప్పటికే వరద కాలువలో 27 గుంటలు కోల్పోగా,అదనపు టీఎంసీ వరద కాలువలో మరో ఏడెకరాలు కోల్పోతు న్నా.ఉన్నదంతా ఊడ్చుకుపోతే మా పరిస్థితి ఏంటి?.