Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలీల మీదకి దూసుకెళ్లడంతో నలుగురు మృతి
- మరో ముగ్గురికి తీవ్రగాయాలు.. మృతులంతా మహిళలే..
- యాక్సిడెంట్‌కు కారణమైన మైనర్ 9వ తరగతి విద్యార్థిగా పోలీసుల గుర్తింపు
- బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రతిపక్షాల ధర్నా, రాస్తారోకో..
- ఆందోళన మధ్యలోనే వెళ్లిపోయిన బీజేపీ నాయకులు!
- జగిత్యాల జిల్లాలో మరో ప్రమాదం.. ముగ్గురు మృతి
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/కరీంనగర్ టౌన్/కరీంనగర్ క్రైమ్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ ప్రాంతంలో ఉదయం 7 గంటలకు ఓ కారు అతివేగం నలుగురు ప్రాణాలను తీసింది. రోడ్డు పక్కనే పని చేసుకుంటున్న వారిపైకి సుమారు 100కిలోమీటర్ల వేగంతో అదుపుతప్పిన కారు దూసుకొచ్చింది. ఘటనలో నలుగురు మహిళలు మరణించగా.. తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు, విపక్షాల నాయకులు పెద్దఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ధర్నా, రాస్తారోకో చేశారు. బాధితులను మంత్రి గంగుల పరామర్శించి ఒక్కో కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుల వివరాలు సేకరించిన అడిషనల్కలెక్టర్, ఆర్డీఓ తక్షణసాయం కింద రూ.10వేల చొప్పున అందించారు. ప్రమాదానికి కారణమైన మైనర్ 9వతరగతి చదువుతున్నట్టు పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. ఇదే సమయంలో వివక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే మద్దతుగా వచ్చిన బీజేపీ నాయకులు మధ్యలోనే వెళ్లిపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. మరో ఘటనలో జగిత్యాల జిల్లా మల్యాల సమీపంలో రాత్రి 7గంటలకు బైక్, ఆటో ఢకొీన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
కారు బాలుడు నడపడటంతోనే ప్రమాదం జరిగిందని కరీంనగర్ సీపీ సత్యనారాయణ మీడియాకు యాక్సిడెంట్ వివరాలు వెల్లడించారు. గృహావసరాలకు ఉపయోగించే కత్తులు, గొడ్డళ్లు తయారుచేసే వృత్తిలో ఉన్న వారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ నుంచి కోతిరాంపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన గుడారాలు వేసుకొని ఉంటున్నారు. వీరు ప్రతి ఆదివారం మేక తలకాయలను కాల్చి ముక్కలుగా కొట్టే పని కూడా చేస్తారు. రేకుర్తిలో నివాసం ఉండే 50 కుటుంబాలకు చెందిన వారు ఆదివారం ఎప్పటిలాగే ఉదయం 5గంటలకే వచ్చి తమ పనుల్లో నిమగం అయ్యారు. కాగా, తన ఇద్దరు స్నేహితులను తీసుకుని కారు యజమాని కుమారుడు (మైనర్) కారును అతివేగంగా నడుపుతున్నాడు. దాంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సునిత(28) అక్కడికక్కడే మరణించగా.. లలిత(25), జ్యోతి(13), ఫరియాద్(27) ఆస్పత్రికి తరలించే మార్గమధ్యలోనే మృతి చెందినట్టు సీపీ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ రాణి, పద్మ, అవంతికతోపాటు మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులోని మైనర్లు అక్కడి నుంచి పరారయ్యారన్నారు.
దాంతో కారు తానే నడిపినట్టు యజమాని రాజేంద్రప్రసాద్ నమ్మించే ప్రయత్నం చేశారనీ, విచారణలో తన కుమారుడే నడిపినట్టు తేలిందని తెలిపారు. బ్రేక్ బదులు, యాక్సిలేటర్ తొక్కడంతోనే వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి ప్రమాదం జరిగిందని వివరించారుఘట నాస్థలాన్ని పరిశీలించిన కరీంనగర్ పట్టణ ఏసీపీ శ్రీనివాస్ రావు, పోలీసులు బృందం, అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీఓ ఆనంద్ మృతుల వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్టు సీపీ తెలిపారు. మరోసారి ఇలాంటి ఘట నలు జరగకుండా పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపడుతుం దనీ, ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు.
విపక్షాల ఆందోళన, మధ్యలోనే వెళ్లిపోయిన బీజేపీ నాయకులు
ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల బంధువులు, విపక్షాల నేతలు పెద్దఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి ఇంత సేపు అయినా కూతవేటు దూరంలో ఉన్న మంత్రి మృతదేహాలను సందర్శించకపోవడం, బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. కారు ప్రమాదానికి కారకులైన వారు స్థానిక మంత్రి, ఎంపీ సన్నిహితులు కావడం, మరణించిన వారు సంచార జాతుల కుటుంబాలు కావడంతో పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో సీపీఐ, కాంగ్రెస్ సహా పలు సంఘాల నాయకులు పాల్గొనగా మధ్యలో వచ్చిన బీజేపీ నాయకులు మధ్యలోనే వెళ్లిపోవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లాలో బైక్, ఆటో ఢకొీని ముగ్గురు మృతి
నవతెలంగాణ - మల్యాల
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం వద్ద ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ఆటో, బైక్ ఢకొీని ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనీలో డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో పని చేసే కూలీలు జగిత్యాలలో వంట సరుకులు తీసుకుని ఆటోలో బయల్దేరారు. రాజారం వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢకొీట్టడంతో ఆటో పల్లీలు కొట్టింది. బైక్‌పై వస్తున్న బత్తిని సంజీవ్ ఆటోలో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన సుధాకర్, గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మధు, కూలీలు జితేంద్ర, సురేష్, హర్షకుమార్, బీహిలను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మల్యాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.