Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణప్రాంతాల్లోనూ ఉపాధి పనులు పెట్టాలి
- 'ఉపాధి'కి నిధులు పెంచాలి : బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధిహామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలకు వేసవి అలవెన్స్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ 17022 (31)ని వెంటనే రద్దు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పనులను రెండు వందల రోజులకు పెంచాలనీ, పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బి.వెంకట్ మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు పూనుకున్నదని విమర్శించారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గడం వల్ల పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయనీ, వాటిని నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, నేతలు జి.నాగయ్య, నారి అయిలయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటేశ్వరరావు, కొండమడుగు నరసింహ్మ, బొప్పని పద్మ, తదితరులు పాల్గొన్నారు.