Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర సర్కారు వైఖరి
- కేటాయింపులు లేకుంటే... అప్పుటి నుంచే యుద్ధం : టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్
- రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని నిర్ణయం
- ఎంపీలకు నివేదికల అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''కేంద్రం నుంచి బడ్జెట్లో రాష్ట్రానికి రావల్సిన నిధుల గురించి ఏడేండ్లుగా వేచిచూస్తున్నాం. పట్టించుకోలేదు. ఈసారికి మరో అవకాశం ఇద్దాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించిందా సరేసరి...లేకుంటే అప్పుడే కేంద్రంపై నేరుగా యుద్ధం ప్రకటిద్దాం'' అంటూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు జరపనందుకు నిరసనగా పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి పార్టీ ఎంపీలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత కె.కేశవరావు, లోక్‌సభలో ఆ పార్టీ పక్షనేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, కేఆర్ సురేష్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బీబీ పాటిల్, పీ రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవితానాయక్, కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఫైనాన్స్ సెక్రటరీ రామకష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ పార్లమెంటులో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక, రెండ్రోజులు వాటిని అధ్యయనం చేసి, రాష్ట్రానికి రావల్సింది ఎంత? ఇచ్చింది ఎంత? అనే అంశాలను పరిశీలించి, ఆ తర్వాత రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకుందామని చెప్పారు. ఇప్పటికే అన్ని శాఖలు కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై లేఖలు రాసాయనీ, వాటికి కేంద్ర బడ్జెట్లో ఏం సమాధానం చెప్తారో వేచిచూద్దామని చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి విభజన హామీలు, గతంలో రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన హామీలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నిధులు, ప్రాజెక్టులు తదితర అంశాలతో కూడిన పూర్తి నివేదికల ప్రతిని పార్లమెంటు సభ్యులందరికీ అందచేశారు. ఆ నివేదికల్లోని ప్రధాన అంశాలు ఇవీ...
విభజన హామీలు
- కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
- తెలంగాణలోని ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇస్తానని విభజన చట్టంలో కేంద్రం పేర్కొన్నది. ఏపీలో పోలవరానికి జాతీయ హౌదా ఇచ్చి, తెలంగాణకు ఇవ్వలేదు.
- షెడ్యూల్ 9,10 లోని సవరణ సంస్థల విభజన ఇంకా అసంపూర్తిగానే ఉంది.
- రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల ప్రక్రియ ఇంకా కాగితాలకే పరిమితమైంది.
- తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని ఇవ్వలేదు. (ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివద్ధి కోసం ఏటా రూ.450 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. గత ఐదేళ్లలో నాలుగు సార్లు విడుదలయినప్పటికీ, ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలి.)
కేంద్రాన్ని తెలంగాణ కోరినవి..
- కాళేశ్వరానికి జాతీయ హౌదా ఇచ్చి, రూ.20 వేల కోట్లు ఇవ్వండి
- రైల్వే ప్రాజెక్టులు వేగవంతం చేయండి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించండి
తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు..
- మనోహరాబాద్ - కొత్తపల్లితోపాటు అక్కన్నపేట్ - మెదక్ రైల్వే లైను, భద్రాచలం రోడ్ - సత్తుపల్లి లైన్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
- కాజీపేట - విజయవాడ మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైను నిర్మించాలి.
- రాఘవాపురం - మందమర్రి మధ్య మూడో లైను నిర్మించాలి.
- ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ లైను నిర్మాణం చేపట్టాలి.
- సికింద్రాబాద్ - జహీరాబాద్ రైల్వే లైన్లను డబుల్ లేన్లుగా మార్చాలి.
- హుజూరాబాద్ మీదుగా కాజీపేట - కరీంనగర్ మధ్య రైల్వే లైను సర్వే చేయాలి.
- బైసన్ పోలో భూమిని ప్రభుత్వానికి అప్పగించండి
- రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయండి
- కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ పెట్టండి
- కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్‌కు నిధులివ్వాలి
- 23 కొత్త జిల్లాల్లో నవోదయ, కేంద్రీయ విద్యాలయ స్కూళ్లు పెట్టండి
- హైదరాబాద్ - కొత్తగూడెం హైవే పనులు చేపట్టండి
- పెద్దపల్లి ఎన్టీపీసీ, ఎరువుల పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
- ములుగులో ఏర్పాటు చేసే తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయంలో స్థానిక గిరిజన విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా చట్టాన్ని మార్పు చేయాలి.
- రామప్ప అభివద్ధికి సహకరించాలి
- మిషన్ భగీరథ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలి
- బయ్యారంలో స్టీలు ప్లాంటు నిర్మించాలి
- హైదరాబాద్‌లోని చింతల్ హెచ్ఎంటీ పరిశ్రమను అభివద్ధి చేయాలి
- రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారులను నిర్మించాలి
- అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టాలి
- నేషనల్ హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి
- రాష్ట్రంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) మంజూరు చేయాలి.
- హైదరాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో నెలకొల్పాలని ప్రతిపాదించిన ఎన్ఐడీని రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు
- జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు విడుదల చేయాలి
- అసెంబ్లీ తీర్మానం మేరకు ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
- పీపీపీ పద్ధతిలో కరీంనగర్లో ఐఐఐటి నెలకొల్పాలి
- రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది
- హైదరాబాద్ - నాగపూర్, వరంగల్ - హైదరాబాద్ ఇండిస్టియల్ కారిడార్‌ను అభివద్ధి పరచాలి
- వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివద్ధి కోసం పి.ఎం.జి.ఎస్.వై. ద్వారా రూ. 4వేల కోట్లు కేటాయించాలి
- వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా, వందశాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలి
- సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి
- వరంగల్ టెక్స్టైల్ పార్కు కోసం రూ. వెయ్యి కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా అందించాలి
- వరద కాలువలకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.