Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునిగిపోతున్న భూములకు నష్టపరిహారం అందించాలి: సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా చిన్నోనిపల్లి దగ్గర 1.5 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న రిజర్వాయర్‌లో భూములు నష్టపోతున్న ఆ గ్రామానికి పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన సోమవారం లేఖ రాశారు. ఆయకట్టు నిర్మాణానికి ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని సూచించారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ పరిధిలో చిన్నోనిపల్లి, లింగాపురం, చాగదోణ, ఇందువాసి, బోయలగూడెం గ్రామాల రైతుల నుంచి 2005లో దాదాపు 2,400 ఎకరాల భూమిని సేకరించారని గుర్తు చేశారు. అప్పుడు ఎకరాకు రూ.70 వేలు, రూ.80 వేలు చెల్లించారని వివరించారు. కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో రిజర్వాయర్ నిర్మాణ పనులు పెండింగ్‌లో పడ్డాయని తెలిపారు. ఇంకా కాలువల నిర్మాణానికి భూమిని సేకరించాల్సి ఉందనీ పేర్కొన్నారు. భూమి విలువ అకస్మాత్తుగా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెరిగిపోయాయని తెలిపారు. అధికారులు తక్షణమే భూమిని ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మునిగిపోతున్న భూములకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలనీ, ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని డిమాండ్ చేశారు.