Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు ఆదివాసీలకు పద్మశ్రీ రావడమే నిదర్శనం: మంత్రి సత్యవతి రాథోడ్
- పద్మశ్రీ రామచంద్రయ్యకు సత్కారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో గిరిజన కళలకు గొప్ప గౌరవం దక్కుతున్నదని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివాసీలిద్దరికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కోయజాతికి చెందిన జానపద, డోలి వాయిద్య కళాకారులు పద్మశ్రీ రామచంద్రయ్యను మంత్రితోపాటు ఎంపీ మాలోతు కవిత, విప్ రేగా కాంతారావు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు కలిసి సోమవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియంలో ఘనంగా సత్కరించారు. ఆయనకు పట్టు వస్త్రాలు సమర్పించి, శాలువాతో సత్కరించారు. రూ.లక్ష నగదు అందించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న గిరిజన కళలు, జాతులను కాపాడుతూ వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కృషి చేస్తున్నదని చెప్పారు. మేడారం జాతరలో సమ్మక్క-సారమ్మల చరిత్రను డోలి వాయిద్యంలో చెప్పే రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించడం తమ ప్రభుత్వానికి ఆదివాసీ కళల పట్ల ఉన్న చిత్తశుద్ధికి, అంకితభావానికి నిదర్శనమన్నారు. గతేడాది గుస్సాడి కనకరాజుఇ, ఈ ఏడాది రామచంద్రయ్యకు పద్మశ్రీలు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలు గొప్ప వారికే కాకుండా మారుమూల గిరిజనులకూ వస్తాయని చెప్పడానికి ఈ ఆదివాసీ ఆణిముత్యాలే నిదర్శనమని అన్నారు. జోడేఘాట్‌లో కొమురంభీం మ్యూజియం, మేడారంలో ఆదివాసీ మ్యూజియాన్ని నిర్మించి కళలు, చరిత్రను భావితరాలకు తెలియజేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో నిర్మించిన గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. పద్మశ్రీ రామచంద్రయ్య కుటుంబానికి ఆయన గ్రామంలో డబుల్బెడ్రూం ఇల్లు, పిల్లలను గిరిజన శాఖ ద్వారా ఆదుకుంటామని అన్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ వచ్చేలా చూస్తామన్నారు. ఎక్కడో కోయ జాతిలో పుట్టాననీ, తనకు 58 ఏండ్లున్నాయని రామచంద్రయ్య చెప్పారు. మేడారం జాతరలో అమ్మవార్ల చరిత్రను చెప్తానని అన్నారు. ఈ పురస్కారం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.