Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవాలి: స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో దళితులపై దురాఘతాలను కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌బాబు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులతో జైలులో మగ్గుతున్న వారి కుటుంబాలను, మద్యానికి బానిసలై ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను సోమవారం మారేపల్లిలో ఆయన పరామర్శించారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్తో కలిసి గ్రామంలో పర్యటించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. బెల్డ్ షాపులను ఎత్తివేయాలని ఆగ్రహించిన దళితులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన కొండాపూర్ ఎస్ఐ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మారేపల్లిలో మద్యానికి బానిసలై మూడు నెలల్లో ఐదుగురు దళిత యువకులు ప్రాణాలు కోల్పోగా.. అందుకు కారణమైన బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని ఆగ్రహించిన దళితులపై అక్రమ కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి హరీశ్‌రావు స్పందించాలని డిమాండ్ చేశారు. బెల్టుషాపుల వల్ల తాగుడుకు బానిసలై మృతిచెందిన ఐదుగురు దళితుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారేపల్లిలో అనుమతి లేకుండా యథేచ్చగా బెల్టుషాపులు నడుస్తున్నా ఎక్సైజ్ సీఐ మధుగౌడ్, అధికారులు తమ మామూళ్ల కోసం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బెల్టుషాపులు ఎత్తివేయాలని ప్రశ్నించిన మహిళలపై, మద్దతు తెలిపిన 19 మంది దళితులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 13 మందిని జైల్లో నిర్బంధించారని విమర్శించారు. బంగారు తెలంగాణ, దళిత బంద్‌తో దళితుల అభివృద్ధి అని చెబుతున్న ప్రభుత్వం దళితుల ప్రాణాలు తీస్తున్న బెల్టుషాపులను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బెల్టుషాపులు నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జైల్లో ఉన్న దళితులను బేషరత్తుగా విడుదల చేయాలనీ, బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. మాణిక్యం మాట్లాడుతూ.. దళితుల చావుకు కారకులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేవరకూ కేవీపీఎస్ దళితులకు అండగా నిలుస్తుందన్నారు. త్వరలో ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో కేవీపీఎస్ జిల్లా నాయకులు వి. రామచందర్, ప్రవీణ్, మండల నాయకులు ఆనంద్ దిలీప్ డాని, ప్రభాకర్, వెంకయ్య ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు, సామాజిక కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సొంత డబ్బులతో బెయిల్ ఇస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ..
జైళ్లో ఉన్న మారేపల్లి బాధితులకు తన సొంత డబ్బులతో బెయిల్ ఇప్పిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగా్గరడ్డి హామీ ఇచ్చారు. సోమవారం మారేపల్లిలో పర్యటించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. చట్ట వ్యతిరేకంగా బెల్టు షాపులు నడుపుతున్న వారిపై కేసులు పెట్టాల్సింది పోయి.. దుకాణాలు వద్దన్న దళితులపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.