Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమనత్వాన్ని ప్రబోధించడానికే సమతామూర్తి కేంద్రం
- ఈ నెల 2 నుంచి 14వరకు రామానుజాచార్యుల సహసాస్రాబ్ది ఉత్సవాలు
- మానవ అవసరాలకు మించి ప్రకృతి విధ్వంసం: త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజంలో కరోనా కంటే అసమానత వైరస్ అత్యంత డేంజర్‌గా తయారైందని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. సమానత్వ భావనను చెప్పి భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యులని కొనియాడారు. ఆయన సహస్రాబ్ది వేడుకల(వెయ్యేండ్ల పండుగ)ను ఈనెల రెండో తేదీ నుంచి 14 వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం ముచ్చింతల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్నజీయర్ స్వామి మాట్లాడారు. కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు మానవ సమాజంలో వ్యాపించిన వైరస్‌ను కూడా తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమాజంలో కులాలు, మతాల మధ్య సమానత్వ భావన కొరవడుతున్నదనీ, మనుషులంతా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి కోవిడ్ కంటే ప్రమాదకమైనదని హెచ్చరించారు. సమానత అనే వ్యాక్సిన్‌ను వెయ్యేండ్ల కిందనే రామానుజాచార్యులు సిద్ధాంత రూపంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. మనుషులు తమ ఉనికి కోసం అవసరాలను మించి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారనీ, సమస్త జీవకోటికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపో యారు. వ్యక్తి గుణానికంటే కులం గొప్పది కాదనీ, కులాన్ని వెనక్కి కొట్టాలని రామానుజాచార్యులు చెప్పారన్నారు. జ్ఞానం తప్ప జాతి ముఖ్యం కాదని చెప్పిన విషయాన్నీ గుర్తుచేశారు. వెయ్యేండ్ల కిందటే దళితులను ఆలయ ప్రవేశం చేయించిన ఘనత ఆయనదని కొనియాడారు. ప్రపంచానికి సమానత్వాన్ని ప్రబోధించడానికే రామానుజాచార్యుల పేరిట సమతామూర్తి కేంద్రం నిర్మించామని చెప్పారు. 216 అడుగులున్న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. సమతామూర్తి కేంద్రంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతకుముందు అహోబిలం చిన్నజీయర్‌స్వామి సమతామూర్తి కేంద్రం గురించి మీడియాకు వివరించారు.