Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ రోడ్ల విస్తరణకు రూ.84కోట్లు మంజూరు
- జంక్షన్ల అభివృద్ధికి నాలుగు కోట్లు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా కేంద్రం అయినప్పటికీ అభివృద్ధిలో అత్యంత వెనుకబడింది. ఈ క్రమంలో గత నెలలో జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎం కేసీఆర్ పట్టణం కలియతిరిగి రోడ్లను పరిశీలించారు. వెంటనే రోడ్ల విస్తరణ, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. అందులో భాగంగానే పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దానికి సంబందించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. డిసెంబర్ చివరి వారంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో పట్టణాభివృద్ధిపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు.
రూ.84కోట్లు రోడ్ల విస్తరణకు..
జిల్లా కేంద్రం అభివృద్ధిపై సమీక్షల అనంతరం మొదటగా రోడ్ల విస్తరణ చేయాలని మంత్రులు, అధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ క్రమంలోనే రోడ్ల విస్తరణకు ఒకేసారి రూ.84కోట్లు విడుదల చేసింది. అంతేగాకుండా ప్రధాన జంక్షన్ల అభివృద్ధికి మరో రూ.4కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.84కోట్లలో వివేకానంద విగ్రహం నుంచి పెద్దబండ మీదుగా క్లాక్‌టవర్ వరకు రూ.18కోట్లు, దేవరకొండ రహదారిపై ఉన్న నీలగిరి-నందికొండ కూడలి నుంచి కతాల్‌గూడెం వరకు రూ.15కోట్లు, కలెక్టరేట్ నుంచి కేశరాజుపల్లి వరకు రూ.15కోట్లు నిధులు కేటాయించారు.
నాలుగు జంక్షన్లు ఇవే..
పట్టణంలో జంక్షన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నిధులు లేకపోవడం వల్ల ఇంతకాలం వాటిపట్ల నిర్లక్ష్యం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన రూ.4 కోట్ల నిధులతో మర్రిగూడ బైపాస్‌రోడ్, ఎన్జీ కాలేజీ జంక్షన్, సుభాష్ చంద్రబోస్ విగ్రహం జంక్షన్, డీఈవో కార్యాలయం ముందున్న జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వెంటనే పట్టణాభివృద్ధి కోసం నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.