Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులు అర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మృతదేహం అప్పగింత
నవతెలంగాణ-నల్లగొండ/ మాడుగులపల్లి
సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తండ్రి, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ముదిరెడ్డి లింగారెడ్డి(100) సోమవారం కన్నుమూశారు. మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో తుదిశ్వాస విడిచాడు. ఆయన భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, జ్యోతి, మల్లు లకిë, రాష్ట్ర సీనియర్ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం లింగారెడ్డి భౌతికకాయాన్ని కుమారులు ముదిరెడ్డి రాంరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలో నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ డాక్టర్ పుల్లారావుకు అప్పగించారు.
నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ముదిరెడ్డి లింగారెడ్డి కుటుంబ సభ్యులంతా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని చెప్పారు. లింగారెడ్డి ఇందుగుల గ్రామంలో రూ.10 లక్షలతో 2011తో సీపీఐ(ఎం) కార్యాలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం మృతదేహాన్ని అప్పగించడం అభినందనీయమన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లింగారెడ్డి పాల్గొని తోపుచర్ల పిరిక ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి సలహాల మేరకు ఇందుగుల ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించారని వివరించారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు సయ్యద్ హాశం, ఎండి.సలీమ్, పి.నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, ఎన్.వెంకటరమణారెడ్డి, అనంతల శంకరయ్య, టీఆర్ఎస్ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కంకణాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.