Authorization
Tue April 08, 2025 06:57:34 pm
- హామీలను అమలు చేయాలి
- నమ్మించి మోసం చేసిన బీజేపీని ఓడించడమే లక్ష్యం: రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నేతల హెచ్చరిక
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని వంచిందని రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. గతేడాది డిసెంబర్ 9న ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని చెప్పారు. మోసకారి ప్రభుత్వాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని వంచించడానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. 'కనీస మద్దతు ధరల చట్టం చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలి, రైతాంగంపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తేయాలి, మరణించిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి, లఖింపూర్ ఖేరి ఘటనకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజరుమిశ్రాను బర్తరఫ్ చేయాలి'అంటూ ఈ సందర్భంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విద్రోహానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షల మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చాక చారిత్రాత్మక పోరాటంగా రైతాంగ పోరాటానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఆ పోరాటానికి లొంగి ప్రజలకు క్షమాపణ చెప్పి చట్టాలను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అన్నారు. కోవిడ్‌లోనూ ప్రాణాలకు తెగించి భారత రైతాంగం పోరాడిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ నేతలు మళ్లీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గట్టెక్కాలని నాటకాలాడుతున్నారని విమర్శించారు. రైతాంగ పోరాటానికి అండగా నిలిచే పార్టీలనే ఎన్నికల్లో గెలిపించాలని పిలుపుని చ్చారు. ఈ పోరాటానికి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీనైనా ఎన్నికల్లో ఓడించాలని చెప్పారు. మోడీ ప్రభుత్వం మేల్కొని రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఆ రాష్ట్రాల ప్రజలు ఓడించి తీరుతారని హెచ్చరించారు. తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్ టి సాగర్ మాట్లాడుతూ ఎస్‌కేఎంకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనవరి 15 వరకు గడువు విధించిందని చెప్పారు. అయినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలనీ, రైతాంగంపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తేయాలనీ, ఉద్యమంలో మరణించిన 700 మందికిపైగా రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలంటూ డిమాండ్ చేసినా కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
రుణాలను రద్దు చేయాలనీ, రుణవిమోచన చట్టం తేవాలని కోరారు. లఖింపూర్ ఖేరి ఘటనకు బాధ్యులైన కేంద్రమంత్రి అజరుమిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా రైతాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని చెప్పారు. రైతులను మభ్యపెడితే ఖబడ్దార్ అనికేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐకేఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు జెవి చలపతిరావు మాట్లాడుతూ రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఐదు రాష్ట్రాల్లో ఎలా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. కేంద్రంపై మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్ మాట్లాడుతూ కేంద్రం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల వల్లే రైతాంగం తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేసిందని గుర్తు చేశారు. ఏ ఒక్క హామీని కేంద్రం అమలు చేయడం లేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు ఢిల్లీ సరిహద్దుల్లోనుంచి రైతులను వెళ్లగొట్టాలనే కుట్రలో భాగంగానే హామీలిచ్చిందని చెప్పారు. వాటిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి బీజేపీ సర్కారుకు లేదని విమర్శించారు. కేంద్రం స్పందించకపోతే రైతాంగ సమస్యలపై ఉద్యమం పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలడుగు భాస్కర్, జె వెంకటేశ్, కూరపాటి రమేష్, శ్రీకాంత్, సోమన్న (సీఐటీయూ), ఆర్ వెంకట్రాములు, బుర్రి ప్రసాద్, పద్మ (వ్యకాస), ఎం శోభన్‌నాయక్ (తెలంగాణ రైతుసంఘం), ఎండీ అబ్బాస్ (ఆవాజ్), కె కాంతయ్య (వ్యకాస), జక్కుల వెంకటయ్య, కొండల్ (ఏఐకేఎస్‌సీసీ), వెంటేశ్వర్లు (ఏఐటీయూసీ), పి సూర్యం, హన్మేష్ (ఐఎఫ్టీయూ), ఆర్ శ్రీరాంనాయక్, ఎం ధర్మానాయక్ (గిరిజన సంఘం), అంజయ్య నాయక్ (గిరిజన సమాఖ్య), పాండురంగాచారి (బీసీ హక్కుల సాధన సమితి), ఝాన్సీ (పీవోడబ్ల్యూ) తదితరులు పాల్గొన్నారు.
హామీలు అమలు చేయాలని గుర్తు చేయండి
రాష్ట్రపతికి ఏఐకేఎస్‌సీసీ లేఖ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని వంచించొద్దని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) కోరింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం ఏఐకేఎస్‌సీసీ జాతీయ నేతలు విస్సా కిరణ్, వేములపల్లి వెంకట్రామయ్య, రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, టి సాగర్, రాయల చంద్రశేఖర్, కన్నెగంటి రవి, అచ్యుత రామారావు, ఉపేందర్‌రెడ్డి, జక్కుల వెంకటయ్య లేఖ రాశారు. రైతుల సహనాన్ని పరీక్షించడాన్ని ఈ ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలయ్యేలా గుర్తు చేయాలని రాష్ట్రపతికి సూచించారు. ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను ఉల్లంఘిస్తే రైతులు తమ ఉద్యమాన్ని మళ్లీ దేశవ్యాప్తంగా చేపట్టడమే అనివార్యమవుతుందని హెచ్చరించారు.