Authorization
Tue April 08, 2025 09:08:50 pm
- విద్యాశాఖ కార్యదర్శికి పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలని పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను సోమవారం ఆ సంఘం అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా విభజన కోసం గతేడాది డిసెంబర్ 6న జీవోనెంబర్ 317ను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. సీనియార్టీలో తప్పులు, స్పౌజ్ కేటగిరీ, మెడికల్ సమస్యలున్న వారిని అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. కొందరు వారి సొంత జిల్లాలకు కేటాయించినా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ అప్డేట్ కానందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్పౌజ్‌లను వారి సొంత జిల్లాలకు కేటాయించాలనీ, ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ నాయకులు పర్వతం సత్యనారాయణ, ఎన్ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.