Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీ, నెహ్రూల పాత్రను బలహీనపరిచే కుట్ర
- జేవీవీ వెబినార్‌లో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వాసాలకు అనుగుణంగా కాకుండా.. హేతుబద్ధత ఆధారంగా చరిత్రను చూడాలని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తద్వారా సత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. 'జాతీయోద్యమం- అసత్య కథనాలు...' అనే అంశంపై సోమవారం జన విజ్ఞాన వేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీలు సంయుక్తంగా వెబినార్‌ను నిర్వహించాయి. కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ... స్వాతంత్రోద్యమ చరిత్రకు సంబంధించి గాంధీ, నెహ్రూల పాత్రను బలహీనపరిచేందుకు హిందూత్వవాదులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిద్దరితోపాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా పలు అబద్ధపు కథనాలను ప్రచారంలో పెడుతున్నారని తెలిపారు. ఏ జాతినైనా సామాజిక సమానత్వం, మత సామరస్యం, ఐక్యతలే పునాదిగా నిర్మించాలని అన్నారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం దేశ ప్రజల్లో కొందరిని.. మరికొందరికి శత్రువులుగా చూపటం ద్వారా జాతిని నిర్మించాలనుకోవటం చరిత్రను వక్రీకరించటమే అవుతుందని విమర్శించారు. పురాతత్వశాస్త్రంలో చెప్పిన దానికి భిన్నంగా ద్రవిడులనే వారే లేరంటూ మతతత్వవాదులు దుష్ప్రచారం సాగించటం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శాస్త్రీయత, హేతుబద్ధత ఆధారంగా చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. తద్వారా అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు కోయ వెంకటేశ్వరరావు, బీఆర్ రాహుల్, రాజా పాల్గొన్నారు.