Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డ్రగ్స్‌ను కొనుగోలు చేసిన తొమ్మిది మందిని విచారించేందుకు వీలుగా వారిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన రిట్‌పై హైకోర్టు ఉత్తర్వుల్ని రిజర్వులో పెట్టింది. వాదప్రతివాదన లు పూర్తవటంతో తీర్పును వాయిదా వేసింది. టోనీ అనే వ్యక్తి డ్రగ్స్‌ను సరఫరా చేస్తే తొమ్మిది మంది వినియోగం కోసం కొన్నారనీ, ఆ తర్వాత వాళ్లు ఇంకెవరికైనా సరఫరా చేశారో లేదో అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేసేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు. కస్టడీకి ఇవ్వాలంటూ కింది కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రిట్‌ను జస్టిస్ లక్ష్మణ్ విచారించారు.బెయిలబుల్ నేరాభి యోగంలో పోలీస్ కస్టడీ అవసరం లేదంటూ తొమ్మిది మంది తరఫు న్యాయవాదులు చెప్పారు.
బండి సంజయ్ కు ముందస్తు బెయిల్...
సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు సోమవారం హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.పోలీసులు అరెస్ట్ చేస్తే రు.25వేల సొంత పూచీకత్తులు రెండు పొంది విడుదల చేయాలని సూచించింది.కేసు దర్యాప్తునకు బండి సంజయ్ సహకరించాలని సూచించింది.ఈ మేరకు షరతులతో ముందస్తు బెయిల్‌కు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదేశాలిచ్చారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరీకి ఆదేశం...
జగిత్యాల జిల్లా రాయకల్‌లో మాదిగకుంట పేరిట ఉన్న చెరువును పునర్ నిర్మించాలన్న ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదనే అంశంపై ఫిబ్రవరి 21న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణివ్వాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. చెరువును పూడ్చేయడంపై గతంలో స్పందించిన హైకోర్టు.. తిరిగి దాన్ని తవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. ఆ ప్రక్రియ జరుగుతోందని గత ఏడాది నుంచి చెబుతుండటంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది.