Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాజీపేటలో కోచ్, వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
- సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట వ్యాగన్‌ను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని విషయాల్లోనూ కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్యే హెడ్ ఆఫీసు, రైల్ నిలయం ఎదుట అఖిలపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు వినరు భాస్కర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్ మాట్లాడుతూ.. ఈ రైల్వే బడ్జెట్లో అయినా తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇలాంటి విషయంలో అడగడానికి చేతగాని తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి మాత్రం అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా సందర్భంగా ఉద్రిత్త ఏర్పడింది. పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య, నాయకులు టి.ఉప్పలయ్య, సంపత్, గొడుకు వెంకట్, సారంగపాణి, సీపీఐ నాయకులు కర్రె భిక్షపతి, మోతె లింగయ్య, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు జంగా రాఘవరెడ్డి, సీపీఐ(ఎంఎల్), టీటీడీపీ తదితర పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.