Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెషల్ డ్యూటీల ఎత్తివేత
- ఓటీ సైతం మింగేసిన వైనం
- కార్మికులపై తీవ్రమైన పని భారం
- పై అధికారుల ప్రశంసల కోసం వెట్టిచాకిరి
ఆర్టీసీలో కార్మిక చట్టాల అమలు అటకెక్కింది. పని గంటలు, సెలవులు, ఓటీలు ఇవేవీ అమలుకావడం లేదు. అడిగేందుకు కార్మిక సంఘాలూ లేవు. అడిగిన కార్మికులను లక్ష్యంగా చేసుకుని మరింత పనిభారం మోపడం ఆనవాయితీగా మారింది. లాంగ్ రూట్లో సర్వీసు కెళ్లిన డ్రైవర్లు సైతం బస్సుల్లోనే నిద్రించడం సాధారణమయ్యింది. టైమింగ్‌తో సంబంధం లేకుండా కేవలం కిలోమీటర్లను టార్గెట్‌గా పెట్టి కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో మొత్తం ఆరు డిపోలున్నాయి. ఇందులో ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి మొత్తం 632 ఉన్నాయి. అయితే ఏ డిపోలోనూ కార్మిక చట్టాలు అమలు కావడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ యాక్ట్-1948 సెక్షన్ 59 ప్రకారం ఒక కార్మికుడు రోజుకు 8 గంటలకన్నా అధికంగా పని చేయరాదు. ఒకవేళ 8 గంటలు దాటితే ప్రతి గంటకు రెట్టింపు వేతనం ఇవ్వాలి. వారంలో 48 గంటల కన్నా ఎక్కువగా పని చేస్తే ఆ సమయానికి గాను రెండు రెట్ల వేతనం పొందే అధికారం ఉంది. వారంలో 54 గంటల కన్నా ఎక్కువగా పని చేయించుకోరాదు. ఆర్టీసీలో ఆ చట్టాలను రద్దు చేస్తూ డిపో మేనేజర్లు కార్మికులను రాచి రంపాన పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక చట్టాల ప్రకారం ఐదు గంటలు వరసగా పని చేసే ప్రతి వ్యక్తికి కనీసం ఒక అరగంట విరామం ఇవ్వాలి. కార్మికుడు వారాంతపు సెలవుల్లో పని చేస్తే 4 గంటల ఓటీ, ఒక రోజు ప్రత్యామ్నాయ సెలవు ఇవ్వాలి.. అన్న చట్టాలను తుంగలో తొక్కారు. పై అధికారుల మెప్పు, ప్రశంసలు, ప్రమోషన్లు పొందేందుకు పని గంటల్లో దొంగ లెక్కలు చూపి కార్మికుల నడ్డి విరుస్తున్నారు. వారంలో రోజుకు 12 గంటల నుంచి 14 గంటల వరకు పని చేయిస్తున్నారు. విపరీతంగా కిలోమీటర్లు పెంచి ఇబ్బందుల పాల్జేస్తున్నారు.
ప్రయోగశాలగా నిజామాబాద్ డిపో-2
నిజామాబాద్ డిపో-2ను కార్మికుల శ్రమదోపిడీకి ప్రయోగశాలగా మార్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఆఫ్ డ్యూటీలను ఓటీలుగా మార్చి ఆ తర్వాత ఓటీలను సైతం ఎత్తేసి.. ఈ ఓటీ డ్యూటీలను సైతం లింక్ డ్యూటీలుగా మార్చారు. లింక్ డ్యూటీలు చేస్తేనే స్పెషల్ ఆఫ్‌లు ఇస్తున్నారు. ఈ విధంగా 25 నుంచి 30 డ్యూటీలు మార్చారు. ఈ డిపోలో 18 సర్వీసులు నిర్మల్, 18 వరంగల్ డ్యూటీలు గతంలో స్పెషల్ ఆఫ్ డ్యూటీలుగా ఉండేవి. కానీ వాటిని రద్దు చేసి మూడు గంటల ఓటీ ఇచ్చారు. ఆ తర్వాత మూడు గంటల ఓటీని 2.40 గంటలకు, ఆ పై 1.40 గంటలకు కుదించారు. ఇప్పుడు ఏకంగా నిర్మల్ డ్యూటీ ఓటీ కూడా ఎత్తేశారు. ఓ కార్మికుడు నిర్మల్ డ్యూటీ చేస్తే మరుసటి రోజు మళ్లీ వరంగల్ స్పెషల్ డ్యూటీ వేస్తున్నారు. నిర్మల్-వరంగల్ రెండు లింక్ డ్యూటీలు అంటే వరుసగా రెండు రోజులు డ్యూటీలు చేస్తేనే మూడో రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. కానీ నిర్మల్-నిజామాబాద్ సర్వీసు నడిపే డ్రైవర్లకు నిర్మల్ డిపోలో మాత్రం స్పెషల్ ఆఫ్ అమలవుతోంది. ఈ లెక్కన నిజామాబాద్ డిపో-2 డ్రైవర్లు ఒక రోజు నిర్మల్‌కు మూడు సర్వీసులు 408 కిలోమీటర్లు బస్సు నడిపిన తర్వాత మళ్లీ తెల్లారి విశ్రాంతి లేకుండా వరంగల్ 446 కిలోమీటర్లు మొత్తంగా 874 కిలోమీటర్లు బస్సు నడపాల్సి ఉంటోంది. అంటే 12+14=26 గంటలు పని చేయిస్తున్నారు. ఇందులో 4 గంటల ఓటీని ఎత్తేసి కార్మికులను కట్టు బానిసలుగా మార్చారు. ఇలానే నిజామాబాద్- హైదరాబాద్ సర్వీసులో 1.10 గంటల ఓటీని ఎత్తేసి దీనికి వరంగల్ డ్యూటీని లింక్ చేశారు. అలాగే భైంసా(410 కిలోమీటర్లు) స్పెషల్ ఆఫ్ డ్యూటీలు వరుసగా రెండు రోజులు చేస్తే మూడో రోజు ఒక రోజు స్పెషల్ ఆఫ్ ఇచ్చి ఒక స్పెషల్ ఆఫ్‌ను, 4 గంటల ఓటీని మింగేశారు. రాష్ట్రంలో ఏ రీజియన్ల్లో లేని విధంగా కార్మికులపై ప్రయోగాలు చేస్తూ ఇక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
అవి డిపో మేనేజర్ పరిధిలోని అంశాలు
నిజామాబాద్-2 డిపోలో స్పెషల్ ఆఫ్ డ్యూటీ, ఓటీ తొలగింపు డిపో మేనేజర్ పరిధిలోని అంశాలు. లైట్, హార్డ్ డ్యూటీలు లింక్ చేసి సర్వీసులు రూపొందించారు. అందులో కార్మికుల శ్రమ దోపిడీ ఏమీ లేదు. నిర్మల్ డిపోలో అమలవుతున్న స్పెషల్ ఆఫ్‌తో నిజామాబాద్‌ను పోల్చలేము. ఆర్టీసీ పరిరక్షణ పేర కార్మికులను నెలలో ఒక్కరోజు ప్రధాన కూడళ్లలో ప్రయాణికులను ఎక్కించాలని చెప్పాం. అవి పంచ సూత్రాల్లో ఒకటి. కార్మికులకు స్పీకర్ కొనుగోలు చేసుకోవాలని సూచన మాత్రమే చేశాం.
- సుధా పరిమిళ, ఆర్ఎం
పరిరక్షణ పేర మళ్లీ కార్మికులకే కష్టాలు..
ఆర్టీసీ పరిరక్షణ పేరుతో ఒకరోజు సంస్థకు ఉచితంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే స్పెషల్ ఆఫ్ రోజు సైతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోనీయకుండా ప్రధాన కూడళ్లలో ఉండి ప్రయాణికులను పిలిచి బస్సులు ఎక్కించాలని ఆర్ఎం ఆదేశాలు జారీ చేసినట్టు కార్మికులు వాపోతున్నారు. పైగా కార్మికులే స్వంత డబ్బుతో స్పీకర్‌ను తెచ్చుకోమని ఆదేశాలు ఇస్తున్నారు.