Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్ వైపు రాష్ట్రం ఎదురు చూపులు..
- పలు అంశాలపై విజ్ఞప్తులు, లేఖల మీద లేఖలు
- ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సాయం కోసం వినతులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత ఏడేండ్ల నుంచి రాష్ట్రంపై శీతకన్నేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... తెలంగాణపై కరుణించేనా..? అని ఇక్కడి ప్రభుత్వం, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా దెబ్బకు గత రెండేండ్ల నుంచి కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే మోడీ సర్కారు ఇతోధికంగా సాయం చేయాల్సిందే. కానీ ఆ దిశగా కేంద్రం ప్రయత్ని స్తుందా? లేదా..? అనేది చూడాలి. ఇప్పటికే రాష్ట్రా నికి సంబంధించిన అనేక కీలకాంశాలకు చాలినన్ని నిధులు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు కేంద్రానికి లేఖలురాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు కొత్త రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న వాటికి పరిపాలనా పరమైన అనమతులివ్వటమనేది తెలం గాణకు అత్యంత ప్రధానమైంది. కానీ వాటిపై ఇప్పటి వరకూ కేంద్రం... స్పందించక పోవటం గమనార్హం. వరంగల్ జిల్లా ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, తెలంగాణలో ఐటీఐఆర్, నిజామాబాద్‌లో పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు తదితరాంశాలపై మోడీ సర్కార్ నోరు మెదపటం లేదు. వాటికి నిధులు కేటాయించకుండా తాత్సారం చేస్తున్నది. గత కొద్ది నెలల క్రితం వరకూ ధాన్యం కొనుగోళ్ల అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. పలువురు రైతులు మరణించటం ఈసమస్యకు ఉన్న తీవ్రతనుతెలిపింది. ఈ నేపథ్యం లో ధాన్యం సేకరణకు వీలుగా కేంద్రం... భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు తగిన నిధుల కేటాయిస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. గతేడాది వరకూ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యేది. ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆయుష్మాన్ భారత్‌ను జోడించారు. రోగుల అవసరం రీత్యా తెలంగాణలో దాని పరిధిని, పరిమితిని పెంచాలి. ఇదే సమయంలో బీబీ నగర్‌లోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు నిధులు కేటా యించాలి. తద్వారా అక్కడ మరింత మెరుగైన వైద్య సేవలం దించాలి. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులను ఆదుకునేందుకు కేంద్రం సంబంధిత శాఖకు అధిక నిధులు కేటాయించాల్సి ఉంది. కరోనా తర్వాత రాష్ట్రంలో పర్యాటక రంగం కుదేలైంది. ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలకు పర్యాటకులు, భక్తులు వస్తున్నా ఇతర ప్రాంతాలకు పర్యాటకులను మన టూరిజం ఆకర్షించలేకపోతున్నది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆ రంగాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అందుకనుగుణంగా కేంద్రం నుంచి నిధులు రాబ ట్టాలి. ఆర్థిక ప్యాకేజీలను అందించాలి. హైదరాబాద్‌లో ఐఐటీ, ఐఐఎమ్ లాంటి సంస్థలను, డ్రగ్ టెస్టింగ్ సెంటర్ (శంషాబాద్ ఎయిర్‌పోర్టులో)ను, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆధ్వర్యాన ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామంటూ గతంలో కేంద్రం ప్రకటించింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకూ అడుగులు పడలేదు. మంగళవారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఈఅంశాలకు చోటు దక్కుతుందా? లేక షరామామూలుగా రాష్ట్రానికి రిక్తహస్తాన్నే చూపుతారా? అనేది చూడాలి.