Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్ వద్ద కలకలం
- 24 గంటల్లోనే పట్టుకుంటాం : సీపీ శ్వేత
నవ తెలంగాణ-సిద్దిపేట
సిద్దిపేట సబ్‌రిజిస్టార్ కార్యాలయం వద్ద సోమవారం కాల్పుల కలకలం రేగింది. ఓ వ్యక్తి స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కార్యాలయానికి రాగా ఈ క్రమంలోనే కారులో డ్రైవర్ వద్ద ఉన్న రూ.43.50లక్షల నగదు ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు డ్రైవర్‌పై కాల్పులు జరిపి నగదుతో ఉడాయించారు. బాధితుడు నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన రియల్టర్ నర్సయ్య హౌసింగ్ బోర్డులో ఓ ప్లాట్‌ను శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తికి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. దాని రిజిస్ట్రేషన్ కోసం నర్సయ్య ఆయన డ్రైవర్ పర్శరాములుతో కలిసి సోమవారం కారులో రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వచ్చారు. ప్లాటు కొనుగోలు చేసిన శ్రీధర్‌రెడ్డి నుంచి రూ.43.50 లక్షలు నర్సయ్య తీసుకున్నాడు. వాటని డ్రైవర్‌కు ఇచ్చి కారులో పెట్టాడు. అనంతరం సంతకం చేయడానికి నర్సయ్య, శ్రీధర్‌రెడ్డి సబ్‌రిజిస్టార్ ఆఫీస్ లోపలికి వెళ్లారు. అక్కడ సంతకం పెట్టి బయటకు వస్తున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్‌పై వచ్చి కారు అద్దాలు పగలగొట్టారు. దాంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. కారును స్టార్ట్ చేసి ముందుకు పోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైక్‌పై మరో వ్యక్తి గన్‌తో బెదిరించి.. డ్రైవర్ ఎడమ కాలిపై కాల్చాడు. ఆ వెంటనే మరో వ్యక్తి డ్రైవర్ పక్క సీటులో ఉన్న నగదు సంచి ( రెడ్‌కలర్ బ్యాగు)ని తీసుకొని బైక్‌పై ఉడాయించారు. అయితే నిందితులు గన్ను కారులోనే వదిలి పారిపోయారు. విషయం తెలుసుకున్న నర్సయ్య తన డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి పంపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఏసీపీ దేవారెడ్డి, సీఐ బిక్షపతి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం ఘటనాస్థలిని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శ్వేత ఘటనా స్థలానికి చేరుకొని, బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కారునూ పరిశీలించారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదిస్తామని సీపీ శ్వేత తెలిపారు. సమీప ప్రాంతాలలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామన్నారు. నిందితులను పట్టుకోవడానికి 15 బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నట్టు చెప్పారు.