Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి
- 24న హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు : జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంచాయతీ కార్మికులు, సిబ్బంది వేతనాలను పెంచాలని గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జీతాలు పెంచకుంటే ఈ నెల 21, 22 తేదీల్లో ఎమ్మెల్యేలను ఇండ్లను ముట్టడిస్తామనీ, 24న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామని ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ శరత్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలడుగు భాస్కర్, సీహెచ్. వెంకటయ్య, పి.గణపతిరెడ్డి, పాలడుగు సుధాకర్, పాండు (సీఐటీయూ), కె. జయచంద్ర (ఏఐటీయూసీ), పి. అరుణ్‌కుమార్ (ఐఎఫ్టీయూ), శివబాబు, స్వామి (ఐఎఫ్టీయూ), బాబూరావు (ఏఐయుటీయూసీి), ఎంకె. బోస్ (టీఎన్టీయూసీ) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు పెంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. జీఓ నెంబర్ 60 ప్రకారం వివిధ శాఖల్లో పనిచేసే వారికి కేటగిరీల వారీగా రూ.15,600, రూ.19,500, రూ.22,750 నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. పంచాయతీ సిబ్బందికీ వేతనాలు పెంచాలని కోరారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రాతిపదికన కార్మికులను నియమించాలనీ, జీఓ నెం.51ని సవరించాలని కోరారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, పాత కేటగిరీలను యదావిధిగా కొనసాగించాలని విన్నవించారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హౌదా కల్పించాలనీ, పీఎఫ్, ఈఎస్‌ఐలతో ఎస్క్డే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.