Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా కమిషనర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు బదిలీల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు లెక్చరర్లకు వెంటనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ విద్యా శాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవో వల్ల రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల బదిలీలు జరిగాయని వివరించారు. దీంతో కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత వరకు వారికి ఉద్యోగం కల్పించకపోవడం వల్ల ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరారు. 317 జీవో బదిలీల ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని కమిషనర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పిస్తామన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిగ్లా రాష్ట్ర అధ్యక్షులు ఎం జంగయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు ల్చెరర్ల అసోసియేషన్ (475) అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి : సీఎస్‌కు వినతి
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16ను 2016లో విడుదల చేసిందని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉన్న అడ్డంకి తొలగిపోయిందని వివరించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) సమన్వయకర్త ఎం జంగయ్య, జీవో నెంబర్ 16 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్, కో కన్వీనర్ జి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.