Authorization
Tue April 08, 2025 05:33:10 pm
ఈరోజు పార్లమెంట్లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే 10వ బడ్జెట్ ఇది. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే రిపోర్టు సందర్భంగా రాబోయే సంవత్సరానికి జాతీయ స్థూలాదాయం (జీడీపీ) వృద్ధిరేటు 8శాతం నుంచి 8.5శాతం వరకు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. గత జీడీపీ గణాంకాలను పరిశీలిస్తే 2019-20లో జీడీపీ రూ.145.69 లక్షల కోట్లుగా ఉన్నది. మధ్యలో 2020-21లో జీడీపీ మైనస్ 7.25శాతానికి పడిపోయింది. 2021-22లో 9.2శాతం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. అయినా రూపాయలలో లెక్కవేస్తే అది రూ.147.54 లక్షల కోట్లు. అంటే 2019-20 నాటి జీడీపీతో పోలిస్తే 2021-22లో నామమాత్రంగా 1.22శాతం మాత్రమే పెరుగుతుంది. ఒమిక్రాన్ దెబ్బతో తిరిగి 2019-20 కన్నా తక్కువ ఉండే పరిస్థితి వస్తుందా అనేది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న.
కొనుగోలు శక్తి పడిపోతున్న తరుణంలో ఆర్థికాభివృద్ధి తిరిగి పుంజుకొనగలదా? అనేది ఇంకొక ప్రశ్న. 2010 ఫిబ్రవరి 26న నాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్టు కేంద్ర బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే కావు, అది ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించేది కూడా. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఇది వాస్తవం. బడ్జెట్ అంటే అంకెలు మాత్రమేకాదు సమాజంలోని ఏ వర్గాలకు ఏ విధమైన ఉపశమనం కల్గించబోతున్నారనే విషయాల పొందిక బడ్జెట్. బడ్జెట్ పల్లకిలో కూర్చునేదెవరు, మోసేదెవరు? అని చెప్పేది బడ్జెట్ సారాంశం.
ఏడాదికాలం పాటు పోరాటాన్ని కొనసాగించి రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దయ్యేలా ప్రభుత్వం మెడలు వంచిన చరిత్ర భారతదేశ రైతాంగానికి ఉన్నది.అయితే వారి కీలక డిమాండ్ అయిన గిట్టుబాటు ధరపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రతిపాదన ఇంకా రాలేదు.ఈ బడ్జెట్లో దానిపై ప్రభుత్వం స్పందిస్తుందా? తద్వారా తాము (బీజేపీ) ఇచ్చిన150శాతం ధర నిర్ణయిస్తా మనే హామీని నిలబెట్టుకుంటుందా? అనేది చూడాలి.
మధ్య తరగతి ఉద్యోగులు వ్యక్తిగత ఆదాయ పన్నులో రాయితీలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. 2014 తరువాత నేటి వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబులలో ఈ ప్రభుత్వం మార్పు చేయలేదు. అలాగే జీవిత బీమా వంటి రంగాలకు ఆదాయ పన్నులో ప్రత్యేక రాయితీ ఉండాలని, ఇతర పొదుపులతో దానిని కలుపరాదనే డిమాండ్ కూడా ఉన్నది. బీజేపీ ప్రభుత్వం 2014లో వ్యక్తిగత ఆస్తి పన్నును ఎత్తేశారు. 2019లో కార్పొరేట్ పన్నును 30శాతం నుండి 22శాతానికి తగ్గించారు. దీనివలన కార్పొరేట్లకు మంచి లాభం చేకూరింది. అయితే కార్పొరేట్ పన్నును కోల్పోవడం వలన ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఆమేర పరోక్ష పన్నుల ద్వారా దానిని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. (ఉదా:పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు) అయితే పరోక్ష పన్నుల భారం సాధారణ ప్రజానీకంపై పడుతుంది. దానివలన వారి కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే సాధారణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందో, మార్కెట్లోని సరుకుల అమ్మకాలూ తగ్గుతాయి. సరుకుల నిల్వలు పెరుగుతాయి. దాంతో కొత్త ఉత్పత్తి నిలిచిపోతోంది. శరవేగంగా పెరుగుతున్న నిరుద్యోగాన్ని మరింత పెంచుతుంది. సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) లెక్కల ప్రకారం, డిసెంబర్ 2021 అంతానికి దేశంలో నిరుద్యోగం 7.31 శాతానికి చేరుకుంది. ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తే నిరుద్యోగం మరింత పెరుగుతుంది. అందుకనే గ్రామీణ ఉపాధి పథకాన్ని మరింత పటిష్టవంతం చేయడంతోబాటు పట్టణ ఉపాధి గ్యారెంటీ పథకాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ వస్తోంది. దీనికితోడు అనేకమంది ఆర్థికవేత్తలు సూచిస్తున్నట్టుగా ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు, అర్హత కలిగిన నిరుద్యోగులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకు నగదు బదిలీ పథకం అమలుచేయడం అనేఇ, ప్రత్యక్షంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే అవకాశం కల్పిస్తుంది. అలాగే విద్యా, వైద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత, వీటిపైన ఖర్చులు పెరిగి మధ్య తరగతి, సామాన్య ప్రజానీకం పైన భారంగా మారుతున్నాయి. వారి సంపాదనలో ఈ ఖర్చులు మరింత కోత పెడుతున్నాయి. అందువలన విద్య, వైద్యంపై ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించి ప్రజానీకానికి ఈ సౌకర్యాలను చౌకగా అందుబాటులోకి తీసుకురావాలి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనేవారు, ఇప్పుడు ఆకాశాన్ని దాటిపోతున్నాయని అనాలి. జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 ఒక ఏడాదిలో కూరగాయలు 24శాతం నుండి 71శాతం వరకు పెరిగితే ఆవనూనె 34శాతం పెరిగింది. రిఫైన్డ్ ఆయిల్ 20శాతం పెరిగింది. ఆదాయాలు తగ్గి, పరోక్ష పన్నులు పెరిగి, నిత్వావసర వస్తువుల ధరలు పెరిగి..వీటన్నింటినీ అనుభవిస్తున్న సాధారణ ప్రజానీకం బడ్జెట్ నుండి ఏం కోరుకుంటారు? ఉద్యోగాల కల్పన కావాలని, కనీస వేతనాలు చెల్లించాలని, ధరలను అదుపు చేయాలని, విద్యా, వైద్యం తమకు అందుబాటులో రావాలని కోరుకుంటారు. మరి కార్పొరేట్ల కొమ్ముకాసే ఈ ప్రభుత్వం, ప్రజల మొరలను ఎంతవరకు ఆలకిస్తుందో చూడాలి. ప్రజానీకంతోబాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్లో తమవాటా పెరగాలని కోరుకుంటాయి.తెలంగాణ రాష్ట్రానికి వస్తే,రూ.50వేల కోట్ల స్పెషల్ ఫండ్స్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి కావాలని,రైల్ కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్, బయ్యార ం స్టీల్ ప్లాంట్..వంటి పరిశ్రమలు కావాలని, ఇతర డిమాం డ్లను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. ఈరోజు బడ్జెట్ ప్రజల ఆశలను ఏమేరకు నెరవేరుస్తుందో చూడాలి.
ప్రధానాంశాలు..
- ప్రస్తుత 2021-22లో వ్యవసాయ రంగం 3.9 శాతం పెరుగొచ్చు.
- పారిశ్రామిక రంగ 11.8 శాతం వృద్థిని కనబరిచే అవకాశం.
- దేశ ఎగుమతులు 16.5 శాతం, దిగుమతులు 29.4 శాతం పెరగొచ్చు.
- భారీగా పెరిగిన యుపిఐ లావాదేవీలు.
- 2021డిసెంబర్లో ఏకంగా రూ.8.26లక్షల కోట్ల లావాదేవీలు నమోదు.
- కే.వేణుగోపాల్