Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాయపు పన్ను శ్లాబ్‌లో మార్పులేదు
- కేంద్ర బడ్జెట్‌పై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి
- ఐటీ రిటర్న్‌ల దాఖలుకు రెండేండ్ల వెసులుబాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్‌తో దేశంలోని వేతన జీవులకు నిరాశే ఎదురైంది. ఆదాయపు పన్ను మినహాయింపులపై ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయ మార్గాలు మూసుకుపోవడం వంటి పరిణామాలు కొనసాగాయి. కానీ ఈ బడ్జెట్లో అలాంటి వారికి ఎలాంటి ఊరట లభించలేదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెంచి తద్వారా డిమాండ్‌లో వృద్ధి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు ప్రజల చేతిలో నిధులను పెంచుతుందని వివరించారు. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎటువంటి మార్పు చేయకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. కరోనా సమయంలో ఆర్థికంగా ఉన్నత వర్గాల ఆదాయం పెరిగినా దిగువ, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు గణనీయంగా పడిపోయినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. దేశ జనాభాలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నారు. 2020 లెక్కల ప్రకారం 130 కోట్ల జనాభాలో వారి సంఖ్య కేవలం 1.45 కోట్లు మాత్రమే. దీంతో ప్రస్తుత కరోనా సమయంలో ఖచ్చితమైన ఆదాయ మార్గంగా ఉన్న ఆదాయపు పన్నులో ఎలాంటి మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం ఐటీ రిటర్నులకు సంబంధించి చిన్నమార్పులు మాత్రమే చేశారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడాలుంటే అసెస్మెంట్ సంవత్సరం నుంచి రెండేండ్లలోపు అప్డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. నేషనల్ పింఛన్ స్కీం (ఎన్పీఎస్)కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యజమాని వాటా కింద చెల్లించే 14 శాతం వరకు పన్ను మినహాయింపు ఉంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ దీన్ని వర్తింపచేశారు. గతంలో వారికి ఈ మినహాయింపు పది శాతం వరకు మాత్రమే ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్ప ఊరట లభించింది.
ఆదాయపు పన్ను శ్లాబులు (మినహాయింపులు వాడుకునే వారికి)
ఆదాయం 60 ఏండ్లలోపు వారికి 60-80 ఏండ్ల వారికి 80 ఏండ్లపైనా
రూ.2,50,000 వరకు పన్ను లేదు పన్ను లేదు పన్నులేదు
రూ.2,50,001 నుంచి రూ.3 లక్షలు 5 శాతం పన్ను లేదు పన్నులేదు
రూ.3,00,001 నుంచి రూ.5 లక్షలు 5 శాతం 5 శాతం పన్నులేదు
రూ.5,00,001 నుంచి రూ.10 లక్షలు 20 శాతం 20 శాతం 20 శాతం
రూ.10 లక్షలు ఆపైన 30 శాతం 30 శాతం 30 శాతం
ఆదాయపు పన్ను శ్లాబులు (మినహాయింపులు వాడుకోని వారికి)
ఆదాయం వర్తించే శ్లాబులు
రూ.2,50,000 వరకు పన్ను లేదు
రూ.2,50,001 నుంచి
రూ.5 లక్షల వరకు 5 శాతం
రూ.5,00,001 నుంచి
రూ.7.50 లక్షల వరకు 10 శాతం
రూ.7,50,001 నుంచి
రూ.10 లక్షల వరకు 15 శాతం
రూ.10,00,001 నుంచి
రూ.12.50 లక్షల వరకు 20 శాతం
రూ.12,50,001 నుంచి
రూ.15 లక్షల వరకు 25 శాతం
రూ.15,00,001 ఆపైన 30 శాతం