Authorization
Tue April 08, 2025 06:06:22 pm
- కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్లకు రెడ్ కార్పెట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు కేంద్ర బడ్జెట్ ససేమిరా అంది. ఆ రంగాన్ని కార్పొరేట్లకు ఫణంగా పెట్టే యోచనను విరమించుకోలేదు. ఏడాదికాలంపాటు సుదీర్ఘంగా కొనసాగిన రైతాంగ ఉద్యమానికి తలొగ్గిన బీజేపీ సర్కారు...నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యాన్ని పరోక్ష పద్దతుల్లో అమలు చేసేందుకు పూనుకున్నది. అయితే బడ్జెట్లో వ్యవసాయ ఊరడింపులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిత్యావసర సరుకుల చట్టం, వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీల చట్టం, ఒప్పంద సాగు (కాంట్రాక్టు ఫార్మింగ్) చట్టం...ఇలా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చింది. సన్న, చిన్నకారు, పేద, మధ్యతరగతి రైతాంగంతోపాటు మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కబంధ హస్తాల్లోకి పంపించేందుకు వీటిని రూపొందింది. కేంద్ర ప్రభుత్వ దురాలోచనను పసిగట్టిన రైతు సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో వాటిని ఉపసంవహరిచుకున్నది. ప్రస్తుతానానికి చట్టాలైతే రద్దయ్యాయి కానీ వాటి అమలు మాత్రం బడ్జెట్ రూపంలో ముందుకొస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు బడ్జెట్ అవకాశాలు కల్పించింది. మార్కెటింగ్, రవాణా, బ్రాండింగ్ తదితర కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపింది. ఉత్పత్తుల అనుసంధానం పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ 10,900 కోట్లు కేటాయించింది. ఈ రంగంలోకి కార్పొరేట్లు వచ్చేందుకు రెడ్కార్పెట్లు పరిచింది. దేశంలో పండించిన పంటను కొని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న కార్పొరేట్లకు అందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పంటల ఉత్పత్తులను కొనేందుకు ససేమిరా అంటున్న కేంద్ర సర్కారు...ఈ సదావకాశాన్ని కార్పొరేట్లు ఉపయోగించేలా బడ్జెట్ రూపకల్పన చేసింది. అందులో భాగంగానే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు ఉన్న అడ్డంకులను ఇప్పటికే తొలగించింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేకంగా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని వెల్లడించింది. కానీ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి స్టార్టప్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులకు ఉండే అవకాశమే లేదు. కానీ పెద్ద కంపెనీలు స్టార్టప్‌ల పేరుతో భూములను కాజేసేందుకు ఇదో ఎత్తుగడ. ఏదోలా వ్యవసాయ రంగాన్ని దేశ, విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బడ్జెట్లో కసరత్తు చేసినట్టే కనిపిస్తున్నది.