Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యావైద్య రంగాలను విస్మరించిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్లో ఆ రంగాలకు ప్రాధాన్యతనివ్వలేదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.39.45 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో విద్యావైద్యం, కుటుంబ సంక్షేమం, క్రీడలు వంటి పద్దులకు నామమాత్రంగా కేటాయించిందని పేర్కొన్నారు. గత బడ్జెట్ కన్నా రూ.5 లక్షల కోట్లు పెంచినా అందుకు తగినట్టు పద్దులను పెంచలేదని వివరించారు. కరోనా కష్టకాలంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రంగాలను విస్మరించడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వ రంగాలను కార్పొరేట్లకు అప్పజెప్పే బడ్జెట్‌గా ఉందని తెలిపారు. విద్యావైద్య రంగాలను ఇప్పటికే కార్పొరేట్ శక్తులు హస్తగతం చేసుకుని ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా రంగాలకు కేటాయింపులు రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాయ పరిమితిని పెంచకపోవడంతో చిన్న ఉద్యోగులపై వేసే ఆదాయపుపన్ను భారంగా మారిందని తెలిపారు. దీన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.