Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్టుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. రెండేండ్లుగా కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు, అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామన్న వాగ్దానాలకు అతీగతీ లేదని పేర్కొన్నారు. పీఎం గతిశక్తి పేరుతో 25 ఏండ్ల ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వివరించారు. ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ వసూలు పెరిగాయనీ, ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్నామంటూ చెప్పిన కేంద్రం ఆ ఫలాలను సామాన్యులకు అందించడంలో మొండిచేయి చూపిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ కొనసాగిస్తూ త్వరలో ఎల్ఐసీ ఐపీవోను తెస్తామంటూ ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. కనీస మద్దతు ధరపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం కర్షకులను కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. దేశంలో ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రతిపాదించడం జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ మాఫియాకు ఊతమిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఖాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి విభజన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.