Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2 లక్షల కోట్లకుపైగా అడిగితే పట్టించుకోలే
- ఉపాధిహామీ చట్టానికి గతేడాది కంటే చిన్నచూపు
- రూ.73 వేల కోట్లే కేటాయింపు
- పెండింగ్ బకాయిలకే రూ.21 వేల కోట్లు!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఆప్ట్రాల్ కూలీలే. వాళ్లేం చేస్తారులే' అని అనుకున్నదో ఏమోగానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధికూలీలను పూర్తిగా విస్మరించింది. కరోనా కష్టకాలంలో పేదలకు పెద్దదిక్కుగా...కడుపులోకి ఐదు వేళ్లు పోయేలా దోహపడుతున్న ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచింది. దేశ ప్రజలంతా రూ.2 లక్షల కోట్లకుపైగా ఇవ్వాలని అడిగితే..రూ.73 వేల కోట్లే కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చావుకబురు చల్లగ చెప్పారు. గతేడాది ప్రకటించిన రూ.98 వేల కోట్లే ఈ పేదలకు ఎక్కువ అనుకున్నదో ఏమోగానీ దానిలో 25 శాతం మేర అడ్డంగా కోత పెట్టి తమది పేదల పక్షపాతి ప్రభుత్వం కాదు కార్పొరేట్ల పక్షమే అనే విషయాన్ని తేటతెల్లం చేసింది. ఆ అత్తెసరు కేటాయింపులోనూ పెండింగ్ బకాయిలకే రూ.21 వేల కోట్లు అయిపోయే అవకాశముంది. అంటే నికరంగా చూస్తే రూ.52 వేల కోట్ల మించి(ఒక వేళ అంచనాలను సవరిస్తే తప్ప) ఉపాధి హామీ పనులకు దక్కవు. మెటీరియల్ కాంపోనెంట్, ఇతరత్రా పోనూ ఉపాధి హామీ పనులకు పెద్దగా ఏమీ మిగలవు. దీన్ని బట్టి ఈ ఏడాది ఉపాధి కూలీలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పనిదినాలు కూడా కోల్పోయే ప్రమాదముంది. తెలంగాణలోని 55,52,793 ఉపాధి హామీ కార్డుదారులపైనా, 1,11,74,448 కూలీలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇక వంద రోజుల పని అనేది ఉట్టిమాటే అన్న పరిస్థితి రాబోతున్నదనే అర్ధమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జీవించాలంటే సంవత్సరంలో కనీసం సగం రోజులైనా పని ఉండాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత గ్రామాల్లో చేతివృత్తిదారులు కూడా చాలా మేరకు కూలీలుగా మారారు. గ్రామాల్లోని ప్రజలకు ఏడాదిలో కనీసం 60-70 రోజులు కూడా పనులు దొరకట్లేదనే ఉద్దేశంతో కచ్చితంగా వారికి వంద రోజుల పని కల్పించాలన్న నిర్ణయాన్ని యూపీఏ-1 ఉమ్మడి కార్యాచరణలో వామపక్షాలు పట్టుబట్టి పెట్టించాయి. దీనివల్ల గ్రామాల్లో కూలీల జీవనప్రమాణాలు పెరిగాయి. కొనుగోలు శక్తి కూడా పెరిగింది. యూపీఏ ప్రభుత్వం బడ్జెట్లో నాలుగు శాతం నిధులను వెచ్చింది. అప్పటి నుంచి కనీసం ఆరు శాతం పెంచాలని వామపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే, మోడీ సర్కారు వచ్చాక ఉపాధి హామీ చట్టానికి క్రమంగా నిధులు తగ్గిస్తూ పోతున్నది. బడ్జెట్లో నాలుగు శాతం నుంచి క్రమంగా 1.5 శాతానికి కుదించింది.
ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే దేశాభివృద్ధి ఎలా?: బి.వెంకట్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి
కరోనా విపత్తులో పేదలను ఆదుకున్నది ఉపాధి హామీ పనులే. అందుకే పనిదినాలకు 200 రోజులకు పెంచి వేతనాలు పెంచాలనే డిమాండ్ పెట్టాం. పట్టణాల్లోనూ విస్తరింపజేయాలంటున్నాం. కేంద్ర ప్రభుత్వం దీన్నేం పట్టించుకోలేదు. ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచకుండా ప్రజల కొనుగోలు శక్తిని ఏవిధంగా పెంచుతారు? 90 శాతం ప్రజల కొనుగోలు పడిపోతే దేశాభివృద్ధి ఎలా ముందుకుపోతుంది? లక్షల కోట్ల రూపాయలను పోగేసుకున్న కార్పొరేట్లు తమ లాభాలను, ఆస్తులను మరింత పెంచుకునేందుకుగానూ పన్ను తగ్గించాలని అడగ్గానే కేంద్రం ఐదు శాతం పన్ను రాయితీ ఇచ్చింది. అదే కేంద్ర ప్రభుత్వం ఏరోజుకారోజు పనిపైనే ఆధారపడి బతుకుతున్న ఉపాధి హామీ కూలీల మొరను పెడచెవిన పెట్టింది. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల రానున్న రోజుల్లో ఆకలిచావులు, ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇది ఆధిపత్యవర్గాలకు ఉపయోగపడే బడ్టెట్ తప్ప పేదలు, కూలీలకు ఒరగబెట్టేది కాదు.