Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం ముసుగులో దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర
అదో దిక్కుమాలిన పార్టీ. నదుల అనుసంధానం మిలీనియం జోక్. ప్రధాని మోడీది కురచ బుద్ది. ఎల్ఐసీని ఎందుకోసం అమ్ముతున్నారు..?. అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్లా వ్యవహరిస్తారా..?. కేంద్ర బడ్జెట్ గోల్మాల్ గోవిందం. మోడీ సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపితేనే దేశ వికాసం. గుణాత్మక రాజకీయ మార్పు కోసం త్వరలో పాలసీ ప్రకటిస్తా:
- సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశానికి నూతన రాజ్యాంగం అవసరముందనీ, సవరణల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఈవిషయంలో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. దేశాన్ని పాలించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని అన్నారు. మతపిచ్చి లేపుతూ ధర్మం పేరుతో దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించుకేనేందుకు యువత నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో తక్షణం అద్భుతమైన పరివర్తన రావాలని సీఎం సూచించారు. ప్రజల ఆలోచనావిధానంలో మార్పు, దేశ ఆర్ధిక పురోగతికి అవసరమైన సంస్కరణల కోసం ప్రాణాలు లెక్కచేయకండా పోరాటం చేస్తానని చెప్పారు. ఈ ప్రయాణంలో తనతో కలిసొచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతానని స్పష్టంచేశారు. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులతో మాట్లాడానని, త్వరలో మహారాష్ట్ర సీఎంను కూడా కలవనున్నట్టు చెప్పారు. అతికొద్ది రోజుల్లోనే నూతన రాజకీయ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ బడ్జెట్ గోల్మాల్ గోవిందం అని ఎద్దేవా చేశారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, రైతులు, నేతన్నలు, రైతు కూలీలు,వృత్తిదారులు, కార్మికులు, ఉద్యోగులకు ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. దానికి దశా, దిశా లేదని కొట్టిపారేశారు. పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అని చెప్పారు. వ్యవసాయం, విద్య,వైద్యం, ఉపాధి హామీ,సాంఘిక, సంక్షేమ రంగాలకు కేంద్రం నిధుల కోత విధించిందని తెలిపారు.
మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాలు చదివి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్.. ఆద్యంతం అధర్మ ప్రవచనాలను వల్లె వేశారని విమర్శించారు. ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను వంచించేలా ఆమె బడ్జెట్ ప్రసంగం సాగిందన్నారు. దేశంలో దళితులు, గిరిజనులు సుమారు 40కోట్ల మంది ఉంటే వారి సంక్షేమానికి కేవలం రూ.12,800 కోట్లు కేటాయిస్తారా..? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా రైతు మహోద్యమం జరిగితే బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకపోవడం బాధాకరమన్నారు. వ్యవసాయ రంగానికి ఉద్దీపనలు లేకపోగా ఎరువులపై సబ్సిడీకి కేంద్రం భారీగా కోత కోసిందన్నారు. మద్దతు ధరల (ఎమ్మెస్పీ) బిల్లు ప్రస్తావన లేదని, విద్యుత్ సంస్కరణలపై వెనక్కి తగ్గినట్లు కూడా బడ్జెట్లో చెప్పలేదన్నారు. గ్రామీణ ఉపాధి హామీకి నిధుల కేటాయింపులు తగ్గాయని వివరించారు. దొంగ సోషల్ మీడియాతో అబద్దాలు ప్రచారం చేసుకున్న మోడీ బండారం ఎనిమిదేండ్లలో బయట పడిందని విమర్శించారు. అందువల్ల బీజేపీ దరిద్రపుగొట్టు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిళించి బంగాళాఖాతంలో పడేస్తేనే దేశం వికసిస్తుందని సీఎం అన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తేనే సాధ్యమని, ఈవిషయంలో యువత ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
'బీజేపీ అంటే దేశాన్ని అమ్ముడు-మత చిచ్చు లేపుడు - రాజకీయంగా పబ్బం గడుపుకొనుడు-మందిమీద పడి ఏడ్చుడు...' అని ఎద్దేవా చేశారు. ప్రపంచ ఆకలి సూచిలో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే మనం దిగువన ఉన్నా..కేంద్రం రూ.65వేల కోట్ల మేర ఆహార సబ్సిడి కోత విధించటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎల్ఐసీని అమ్ముతున్నట్టు బడ్జెట్లో ప్రకటించడంపై కేసీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. ఎవరి ప్రయోజనాలను ఆశించి ప్రగతిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ప్రశ్నించారు. అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారా..? అని ప్రధాని మోడీని నిలదీశారు. 'ఏం దందా ఇది...?' అంటూ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి పెట్టుబడిని రెట్టింపు చేశారు. అందరికీ ఇల్లు అన్నారు..ప్రతి ఇంటికీ రూ.15లక్షలు ఇచ్చారా..? నల్లధనం సంగతేంటి..? 15 లక్షల ఉద్యోగాలెక్కడ..? మీరిచ్చిన ఒక్క మాట మీదైనా నిలబడ్డారా...?' అంటూ ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అహ్మదాబాద్‌లో ఆర్బిట్రేటర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి మోడీ మరోసారి తన కురచ బుద్ధిని చాటుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన ఆర్బిట్రేటర్ సెంటర్‌కు నిధులు కేటాయించాల్సింది పోయి..పోటీగా శిఖండిని తెచ్చిపెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ యువత, మేధావులు ఈ అంశంపై మేథావులు ఆలోచించాలని కోరారు. క్రిప్టో కరెన్సీపై 30శాతం పన్ను వసూలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై సీఎం విస్మయం వ్యక్తంచేశారు.
గోదావరి, కృష్ణా, కావేరీ నదుల అనుసంధానాన్ని మిలీనియం జోక్‌గా కేసీఆర్ అభివర్ణించారు. ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏ అధికారం ఉందని గోదావరి, కావేరి జలాలను కలుపుతారు..? గోదావరి జలాలపై తెలంగాణ, ఏపీలకే హక్కు ఉంది. గోదావరిపై ట్రిబ్యునల్ తీర్పు ఉన్న సంగతి తెలియదా..? నదుల అనుసంధానం తెలివితక్కువ నిర్ణయం కాదా..? గోదావరిలో మిగులు జలాలు ఉంటే తెలంగాణ ప్రతిపాదనలు ఎందుకు పరిష్కరించడంలేదు..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో నీళ్ల యుద్దాలకు, తాగునీటి సమస్యలకు కేంద్ర విధానాలే కారణమని స్పష్టంచేశారు. బీజేపీ వంటి సిగ్గుమాలిన పార్టీ, ఇటువంటి దుర్మార్గ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని అన్నారు. ముచ్చింతల్‌లో చిన్నజీయర్ అనుచరులు సమతామూర్తి విగ్రహం పెడితే..దాన్ని కూడా మోడీ ఏర్పాటు చేసినట్టు బీజేపీ దొంగ సోషల్ మీడియాలో నిర్లజ్జగా ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్దాలు చెప్పే గొప్ప మోసగాళ్లనీ, వారికి సామాజిక బాధ్యత లేదన్నారు. రిటైర్డ్ ఐఎఎస్,ఐపిఎస్,ఐఎఫ్ఎస్ అధికారుల సమావేశం త్వరలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్కడ అన్ని అంశాలపై చర్చిస్తామని తెలిపారు. త్వరలో ఐదు తరాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను లోక్‌సభ ఎలక్షన్లకు సెమీఫైనల్‌గా పరిగణించలేమన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ వేషధారణ, ట్రిక్కులు ప్రయోగించడం మోడీకి పరిపాటిగా మారిందని సీఎం ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. యూపీలో బీజేపీ ప్రభ నానాటికీ తగ్గుతున్నదని చెప్పారు. బీజేపీ విధానాలపై దేశం స్పందించాల్సిన (రియాక్ట్్) సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కేంద్ర విధానాలపై ప్రజలు, యువత ఉద్యమించాలని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.