Authorization
Tue April 08, 2025 07:37:10 am
- విభజన హామీలను నెరవేర్చేందుకు చర్యల్లేవు
- కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసనలు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో సంక్షేమానికి కోతలు పెట్టారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తద్వారా రాష్ట్రానికి ద్రోహం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రూ.39 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ స్థూలంగా ప్రజాసంక్షేమాన్ని ఫణంగా పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వీలుగా చర్యలు చేపట్టలేదని వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ నిర్మాణానికి ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో శంఖుస్థాపన చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్లో గిఫ్ట్ సిటీ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పనిచేస్తుందంటూ బడ్జెట్ సాక్షిగా ప్రకటించటం తెలంగాణ ప్రజలను మోసగించటమేనని విమర్శించారు. తెలంగాణ ఆదివాసీ విశ్వవిద్యాలయాన్ని మాటమాత్రంగా బడ్జెట్లో పేర్కొని, రెండు రాష్ట్రాలకూ కలిపి రూ.43 కోట్లు కేటాయించారని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికీ, రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్లు పూర్తిచేయటానికీ, ఖాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావన కరువైందని పేర్కొన్నారు.
ఉపాధి హామీ నిధుల్లో కోత
ఉపాధి హామీ పథకానికి గతేడాది పెట్టిన ఖర్చుతోపోలిస్తే దాదాపు నాలుగోవంతు బడ్జెట్‌ను కేంద్రం కోత విధించిందని తమ్మినేని తెలిపారు. గత బడ్జెట్లో రూ.98 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేస్తే 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.73 వేల కోట్లకు తగ్గించారని వివరించారు. నదుల అనుసంధానం పథకాన్ని గొప్పగా ప్రకటించినా బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఈ గొప్పలు కనిపించలేదని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ముప్పు తొలగిపోలేదంటూ అంతర్జాతీయ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తున్నా దేశంలో కోవిడ్ అత్యవసర సేవలకు కేటాయింపుల్లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక విద్యాకేంద్రాలుగా తీర్చిదిద్దుతా మని ప్రకటించినా ఆ మేరకు కేటాయింపుల్లేవని పేర్కొన్నారు. 2025 నాటికి దేశజనాభాలో సగానికి సగం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని అంచనా వేసినా అక్కడ మౌలిక వసతులు కల్పనకు ఉద్దేశించిన అమృత్ పథకానికి కేటాయింపుల్లేవని విమర్శించారు. పట్టణ ప్రాంత పేదలకు ఇచ్చే వడ్డీ రాయితీల్లో కోత విధించిందని తెలిపారు. ఈ బడ్జెట్లో పట్టణ ప్రాంత పేదల పట్ల కేంద్రానికి ఉన్న నిర్లక్ష్య భావన స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.
రక్షణరంగంలోనూ ప్రయివేటు సంస్థలకే లాభాలు
ఆత్మనిర్భర రక్షణ రంగం నినాదంతో దేశీయంగా ఆ రంగానికి కావాల్సిన ఆయుధాలు, ఇతర సేవలను దేశీయ ప్రయివేటురంగం నుంచి ఆ శాఖ మెజా రిటీ కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందంటూ కేంద్రం షరతు విధించిందని తమ్మినేని తెలిపారు. ఇది కేవలం రక్షణ రంగంలోకి ప్రవేశిస్తున్న ప్రయివేటు సంస్థలకు లాభాలను గ్యారంటీ చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని విమ ర్శించారు. సాగునీటి వసతి కల్పిస్తే స్థూలజాతీయోత్పత్తి రెండు శాతం అద నంగా పెరిగే అవకాశముందంటూ ఆర్ధికవేత్తలు చెబుతున్నా సాగునీటి పారు దల రంగానికి కేటాయింపులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాలేదని తెలిపారు. మౌలికసదుపాయాల రంగానికి 30 శాతం పెంచామని గొప్పగా చెప్పుకుంటోందని వివరించారు. క్యాపిటల్ ఖర్చు పేరుతో ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఉపాధి పెంచేదిగా లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను వ్యతిరేకించాలనీ, రాష్ట్రానికి జరిగిన ద్రోహాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.