Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'గత బడ్జెట్‌కు 12 శాతం పెంచి.. ప్రస్తుత బడ్జెట్‌ను 39 లక్షల కోట్టుగా నిర్దారించారు.. ఏడు శాతం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే బడ్జెట్ పెంపు నామమాత్రమే...' అని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ... 'కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ మీదే మళ్లీ ఆధారపడింది. ఎల్ఐసీ నుంచి రూ.లక్షకోట్లు, సిటీ బ్యాంకు తదితర మూడు బ్యాంకుల నుంచి యాభై వేల కోట్ల ఉపసంహరణ ద్వారా బడ్జెట్‌ను నెగ్గుకు రావాలనే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ద్రవ్యలోటు 6.9 శాతం ఉన్నప్పటికీ ప్రపంచ బ్యాంకు నిబంధనలకు తలొగ్గి దాన్ని తగ్గించుకోవటానికి వీలుగా విద్య, వైద్యం, సంక్షేమం మీద వేటు వేసే అవకాశం ఉంది. ప్రజల కొనుగోలు శక్తికి, నగదు బదిలికీ ద్రవ్యలోటును బదిలీ చేస్తే కొంత మార్పు వస్తుంది. ఆ లోటును ప్రజల కొనుగోలు శక్తి పెంచటానికి ఉపయోగిస్తే ఆశాజనకంగా ఉంటుంది. కానీ రెండేడ్ల అనుభవం చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మూడు డీఏలను స్తంభింపజేయటం ద్వారా లక్ష కోట్లకుపైగా కరోనా కోసం కోత పెట్టారు. వ్యవసాయం, ఇతర అన్ని శాఖలకు కూడా గత బడ్జెట్‌కు ఐదు నుంచి పది శాతం పెంచి కేటాయింపులు చేశారు. కానీ ఆరోగ్యశాఖకు మళ్లీ అన్యాయం జరిగింది. దశాబ్ద కాలం క్రితం జీడీపీలో ఈ రంగానికి మూడు శాతం నిధులు కేటాయించాలనే సిఫారసులు ఉన్నా ఏనాడూ 1.2 శాతానికి దాటలేదు. ఈసారి కూడా వైద్య రంగానికి కేటాయింపులు చేయకపోవటం వల్ల ప్రజారోగ్యం విషయంలో మనం చాలా బలహీనపడిపోయాం. వృద్ధిరేటు పెరగకుండా ఉద్యోగిత రేటు పెరగదు. అది 9.2 శాతమని ప్రకటించారు. అది కరోనా కంటే ముందు నుంచి ఉన్న వృద్ధి రేటు కాదు. మైనస్ వృద్ధి రేటు నుంచి పాజిటివ్ వృద్ధిరేటును తీసుకుని చూపెడుతున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి విలువను పెరుగుదలలో చూపెట్టి,వృద్ధిరేటు అంటున్నారు...'అని వ్యాఖ్యానించారు.