Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్‌పై ఎఫ్‌టీసీసీఐ చైర్మెన్ భాస్కర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్... దేశాన్ని, రాష్ట్రాన్ని కరోనా కష్టాల నుంచి బయటపడేసేలా లేదని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) చైర్మెన్ కె.భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని ఆయన తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు రమాకాంత్ ఇరానీ, అనిల్ అగర్వాల్‌తో కలిసి ఆయన కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడారు. దీర్ఘకాలంలో డిజిటలీకరణ, స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు వీలుగా బడ్జెట్లో కేటాయింపులు చేశామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని గుర్తు చేశారు. ఇది తెలంగాణలాంటి రాష్ట్రాలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వీ-హబ్, టీ-హబ్‌లాంటి వాటికి ఇది ఊతమిచ్చేదేనని చెప్పారు. పీఎం గతిశక్తి కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే ఆర్థిక సాయాలను రూ.2 లక్షల కోట్లకు పెంచినప్పటికీ... ఆర్బీఐ విధించిన నిబంధనలు వాటికి ప్రతిబంధకంగా ఉన్నాయని తెలిపారు. వాటిని సరళీకరించటం ద్వారా ఆయా పరిశ్రమలకు ఆ నిధులు ఉపయోగపడేలా చూడాలని కేంద్రాన్ని కోరారు.
ఉత్పాదక రంగాలకు ఊతమేది..?
ఎఫ్‌టీసీసీఐ డిప్యూటీ సీఈవో సుజాత
కేంద్ర బడ్జెట్లో ధరల స్థిరీకరణకు, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదని ఎఫ్‌టీసీసీఐ డిప్యూటీ సీఈవో టి.సుజాత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తున్నాం.. ఈ క్రమంలో రాబోయే 25 ఏండ్లకు అంటే స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలకు వీలుగా ప్రణాళికలు వేసుకున్నామంటూ కేంద్రం చెబుతున్నదని తెలిపారు. కానీ కరోనాతో కుదేలైన ప్రస్తుత దేశ ఆర్థిక రంగాన్ని గట్టెక్కించటానికి వీలుగా చర్యలు తీసుకోలేదన్నారు.