Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగానికి నిరాశాజనకం : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ వేతన జీవులకు ఏమాత్రం ఊరట కలిగించలేదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) పేర్కొంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని భారీగా ఆశలు పెట్టుకున్న ఉద్యోగవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేశారని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయపు పన్ను శ్లాబులను, పొదుపు మొత్తాలపై ఇచ్చే రాయితీలను యథాతధంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించారని పేర్కొన్నారు. 2013లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది ఏండ్లు గడుస్తున్నా ఆదాయపు పన్ను మినహాయింపును ఏమాత్రం పెంచలేదని విమర్శించారు. సీపీఎస్, ఎన్పీఎస్ చందా మొత్తాన్ని పది శాతానికి బదులు 14 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించబోదని స్పష్టం చేశారు.
ఉద్యోగులకు మొండిచేయి : పీఆర్టీయూటీఎస్
ఆదాయపు పన్ను రాయితీలు కల్పిస్తారని ఎదురుచూసిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు విమర్శించారు. ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అని తెలిపారు. ఐదేండ్లుగా ఉద్యోగులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు విషయంలో ఉద్యోగులకు నిరాశ ఎదురైందని తెలిపారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా శ్లాబ్‌లను మార్చాల్సిన అవసరముందని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్యారంగంలో డిజిటలైజేషన్, ఆన్లైన్ తరగతులను ఆర్భాటంగా ప్రకటించినా, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల అవసరాలకు నిధులు కేటాయించలేదని తెలిపారు.
విద్యకు ప్రాధాన్యత ఏదీ? : టీపీటీఎఫ్
విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఎక్కడుందని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు ప్రశ్నించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ ఉందని విమర్శించారు. వేతన జీవులకు ఈ బడ్జెట్ నిరాశ కలిగించిందని తెలిపారు. విద్యాఛానెళ్లను పెంచడం, ఈ విద్య, డిజిటల్ విద్య అందించడం, నైపుణ్యాలు ప్రాధాన్యం ఇస్తూ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనను నిర్వీర్యం చేసేలా కేంద్రం నిర్ణయాలున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయుల నియామకాలు, వసతుల కల్పనను కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. నిధులను పెంచడం లేదని పేర్కొన్నారు.
నిరాశపర్చిన బడ్జెట్ : పీఆర్టీయూ తెలంగాణ
ఆదాయపు పన్ను మినహాయింపు కల్పిస్తారని ఆశించిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించిందని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి విమర్శించారు. ఆదాయపు పన్ను శ్లాబులు, స్టాండర్డ్ డిడక్షన్, 80సీ పరిమితి గానీ మార్చకుండా యథాతధంగా ఉంచడం వల్ల తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. ఏడేండ్ల కింద నిర్ణయించిన ఆదాయపు పన్ను శ్లాబులను ఇంకా కొనసాగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కోట్లలో లాభాలు గడించే కార్పొరేట్ సంస్థల పన్నును 25 శాతానికి తగ్గించిన ప్రభుత్వ సాధారణ ఉద్యోగులకు మాత్రం రూ.10 లక్షల ఆదాయం దాటగానే 30 శాతం పన్ను వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.