Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యరంగాన్ని ప్రయివేటీకరించబోయే ఎన్డీహెచ్ఎంకు పెంపు
- వారియర్ల వేతనాలు, బీమా మరిచిన నిర్మలమ్మ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజారోగ్య రంగానికి కేంద్రం తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదు. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో గతేడాది కన్నా స్వల్పంగా పెంచినట్టుగా చూపించినప్పటికీ పలు కీలకమైన విషయాలను విస్మరించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ప్రధానంగా నిధుల రాక జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారానే జరుగుతున్నది. దీని ద్వారా ప్రజారోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే పలు పథకాలు అమలవుతుంటాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమానికి గతేడాది రూ.36,576 కోట్లను కేటాయించగా ఈ సారి రూ.37,000 కోట్లతో స్వల్పంగా పెంచారు. ఆరోగ్య రంగాన్ని ప్రయివేటీకరించేందుకు ఉద్దేశించిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)కు మాత్రం ఏకంగా రూ.30 కోట్ల నుంచి రూ.200 కోట్లకు నిధులు పెంచడం గమనార్హం. కేంద్రం అమలు చేసే ఆరోగ్య పథకాలకు 2021-22లో రూ.10,566 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది రూ.15,163 కోట్లకు పెంచినట్టు చూపించారు. మొత్తానికి ఆరోగ్య రంగానికి రూ.86,200 కోట్లు కేటాయిచారు. గతేడాది రూ.73,931 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. సాధారణ సమయాల్లో కన్నా కరోనా సమయంలో ప్రజారోగ్య రంగం బలోపేతంగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసింది. అయితే మహమ్మారి నేర్పిన గుణపాఠం నుంచి తగిన సిద్ధపాటు దిశగా కేంద్రంలో నిధుల కేటాయింపులు జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యారోగ్య వారియర్ల సంక్షేమం ఊసే ఎత్తలేదు. ఈ శాఖలో అత్యధిక మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందే పని చేస్తున్నారు. కనీస వేతనాలు, బీమా సౌకర్యం తదితర డిమాండ్ల కోసం పలు మార్లు కోరినప్పటికీ కేంద్ర బడ్జెట్ వారిని విస్మయానికి గురి చేసిందని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు భూపాల్ తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చ్కెర్మెన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ ప్రతిపాదన ద్వారా యూనివర్సల్ హెల్త్ యాక్సెసబిలిటీని ప్రారంభించడాన్ని ఆహ్వానించారు. తద్వారా ఆరోగ్య రంగం పురోగమించేందుకు అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఆయుష్మాన్ భారత్కు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా రూ.6,400 కోట్లు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, పాత మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపునకు రూ.7,500 కోట్లు, పరిశోధలకు రూ.3,200 కోట్లు, ఐసీఎంఆర్ కు రూ.2,198 కోట్లు కేటాయించారు.