Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట కొనుగోళ్లకు నిధులు తగ్గించిన కేంద్రం
- మౌలిక వసతుల కల్పనకు పైసా విదల్చని వైనం
- తెలంగాణపై తీవ్ర ప్రభావం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇక ముందు రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం మరింత కష్టాల్లో పడనుంది.కేంద్ర బడ్జెట్లో పంట కొనుగోళ్లకు నిధులు తగ్గించడంతో ఈ దుస్థితి రానుంది. గిడ్డంగులు, మౌలిక వసతులకు కూడా కేంద్రం నిధులు తగ్గించింది. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ కుదించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే అవకాశం ఉన్నది. దేశ వ్యాప్తంగా గతేడాది 1,286 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈఏడాది 1,208 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించాలని నిర్ణయించింది. ఈనేపథ్యంలో 80లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను తగ్గించింది. దీంతో ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లను నిలుపుదల చేయనుంది. ఇది తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం చూపనుంది. వానాకాలం సీజన్లో పండిన ధాన్యాన్ని కొంటాం కానీ యాసంగి ధాన్యాన్ని కొనేందుకు సిద్ధంగా లేమంటూ కేంద్రం ప్రభుత్వం చెప్పినట్టుగానే బడ్జెట్లోనూ కోతలు పెట్టింది. రూ 88వేల కోట్లతో 5.6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కేంద్ర నిబంధనలతో కొనుగోలు కొంత జాప్యమవుతున్నది. తెలంగాణ 2014-15లో 24,29 లక్షలమెట్రిక్ టన్నులు, 2015-16లో 23.56 లక్షల మెట్రిక్ టన్నులు, 2016-17లో 35.70 లక్షల మెట్రిక్ టన్నులు, 2017-18లో 53.99 లక్షల మెట్రిక్ టన్నులు, 2018-19లో 77.46 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20లో కోటి 11 లక్షలు, 2020-21లో కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది.
ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం కోనుగోళ్లకు నిధులు తగ్గించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశమున్నది. ఒకవైపు ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంటే, మరోవైపు కేంద్రం కొత్త కొత్త నిబంధనలతో ఆంక్షలను విధిస్తున్నది. గతేడాది కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒరిసా రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ ద్వారా బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేసింది. ఈ నిర్ణయంతో ధాన్యం సేకరణ పెద్ద సమస్యగా మారనుంది. కేంద్రం రైతుల నుంచి ధాన్యం కొనకపోతే రైతులు ప్రయివేటులో అమ్ముకోవాల్సి వస్తున్నది. రైస్‌మిల్లర్లు అగ్గువకు తీసుకుని బియ్యంగా మార్చి...ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉన్నది.